సూర్యాపేట : సాగునీటి దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లాలో పారుతున్న కాళేశ్వరం జలాలకు లక్ష జన హారతి పేరుతో వినూత్న కార్యక్రమాన్నీ మంత్రి జగదీష్ రెడ్డి చేపట్టారు. లక్ష జన హారతిలో మంత్రి జగదీష్ రెడ్డి, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ లు పాల్గొననున్నారు. కాళేశ్వరం జలాలు పారుతున్న 68 కిలోమీటర్ల మేర సరిగ్గా 12 గంటలకు లక్ష మందితో లక్ష జన హారతి చేపట్టనున్నారు. కాళేశ్వరం జలాలకి లక్ష జన హారతి కార్యక్రమానికి 7 మండలాలు, 126 గ్రామాలు ముస్తాబయ్యాయి. ప్రతి పావు కిలోమీటరుకు ఒకరు చొప్పున 68 కిలోమీటర్లకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. లక్ష జన హారతికి రావాలంటూ మహిళలు బొట్టు పెట్టి పిలుచుకుంటున్నారు.
కాళేశ్వరం జలాలు పడుతున్న 126 గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామాలలో జరుగుతున్న బొడ్రాయి పండుగ వాతావరణాన్ని లక్ష జన హారతి మైమరిపిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాలువగట్ల మీదనే వంటా వార్పు చేపడుతున్నారు. అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లక్ష జన హారతి ని పురస్కరించుకుని ప్రతిచోట వైద్యబృందాలను జిల్లా వైద్యశాఖా అందుబాటులో ఉంచింది. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండలం ఈటూరు నుండి పెన్ పహాడ్ మండలం రావిపాడు చెరువు వరకు లక్ష జనహారతి నిర్వహించనున్నారు. నాగరం, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట రూరల్, ఆత్మకూర్ ఎస్,చివ్వేంల, పెన్ పహాడ్, మోతె మండలాల్లో లక్ష జన హారతి నిర్వహించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.