ఆంధ్రప్రభ స్మార్ట్, నల్లగొండ: ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా రాయితీలు ప్రకటించింది. నల్లగొండ జిల్లాలో నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో ఉద్యాన వన పంటల సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సహించడానికి ప్రణాళిక రూపొందించింది. ఆసక్తి గల రైతులను వీటిని వినియోగించుకోవాలని ఉద్యానవన శాఖ అధికారులు కోరుతున్నారు. సాగుకు అయ్యే ఖర్చులో 40 శాతం రాయితీగా వస్తుంది.
357 హెక్టార్ల లక్ష్యం
నల్లగొండ జిల్లాలో 357 హెక్టార్ల ఉద్యానవన పంటలకు రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. బొప్పాయి, అరటి , మామిడి , జామ, సీతాఫలం , నిమ్మ, బత్తాయి, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, ఆమ్లా , పనస , నేరేడు , చింతతోపాటు సంకరజాతి కూరగాయల సాగుకు ప్రభుత్వం రాయితీలను కల్పించనున్నది. రాయితీపై మొక్కలు సరఫరా, డ్రిప్సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించనుంది.
పంటల వివరాలు…
జిల్లాలో బొప్పాయి 40 హెక్టార్లు, అరటి 10, మామిడి 10 , జామ 45 , సీతాఫలం 15 , నిమ్మ 40 , బత్తాయి 136, డ్రాగన్ ఫ్రూ ట్ 26 , అవకడో 2.70 , ఆమ్లా 8 , పనస 2 , నేరేడు 5 , చింత 5 హెక్టర్లకు రాయితీలు ఇవ్వడానికి లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే హైబ్రిడ్ కూరగాయలు 25 హెక్టార్లు, పూల సాగు 10 , పాత తోటల పునరుద్ధరణ 60 , మల్చింగ్ 215 హెక్టార్లను టార్గెట్ ఇచ్చారు.
నాన్ ఆయకట్టు ప్రాంతాల్ల రైతులకు ప్రాధాన్యం
నీటి వినియోగం తక్కువగా ఉండే పండ్ల తోటల సాగు వల్ల రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ప్రభుత్వం ఆలోచన. జిల్లాలో దేవరకొండ, చందంపేట, నేరేడు గొమ్ము, పెద్దవూర, చింతపల్లి, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి తదితర మండలాలు నాన్ ఆయకట్టు మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంత రైతులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. సుధీర్ఘ కాలం తర్వాత ఉద్యానవన పంటలకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుంది.