Friday, November 22, 2024

ఎండు ముఖం పడుతున్న పత్తి… నీటి త‌డులు అందిస్తున్న రైతులు

మోత్కూర్, (ప్రభ న్యూస్): వరుణుడు కాస్త ముఖం చాటేయడంతో… భగభగ మండే ఎండలకు తట్టుకోలేక పత్తి చేనులు ఎండు ముఖం పట్టడంతో, లక్షలాది రూపాయలు వెచ్చించి సాగుచేసిన చేనులను కాపాడుకునేందుకు పత్తి రైతులు సకల కష్టాలు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని జామ చెట్ల బావి గ్రామానికి చెందిన మహిళా పత్తి రైతు గనగాని అంజమ్మ 2 ఎకరాల ఎర్ర చెల్కలో రోహిణి కార్తెలో పత్తి సాగు చేపట్టింది.

జూన్ ,జులై లో కురిసిన వర్షాలకు 2 సార్లు చేనుకు మందు పోసి,కలుపు తీసి,5,6 సార్లు గుంటుక తోలి,3 సార్లు పై మందులు పిచికారీ చేసి సుమారు 50 వేలు పెట్టుబడి పెట్టింది. ఏపుగా పెరిగిన పత్తి చేను కాస్త పూత పూసి, కాత దశలో ఉండగా గత 25 రోజులుగా వర్షాలు లేకపోవడంతో చేను ఎండు ముఖం పట్టి గూడ రాలుతుండడంతో, బోర్ వసతితో ప్రస్తుతం పత్తి చేను సాళ్ళకు నీటి తడులు అందిస్తూ చేనును కాపాడుకుంటున్నట్లు మహిళా రైతు అంజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి సాగు చేసిన రేగడి నేలల్లో పదును ఉండగా,ఎర్ర ,దుబ్బ చెల్కలో పత్తి సాగు చేసిన రైతులు పదును లేకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement