సూర్యాపేట, ప్రభ న్యూస్: ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ నాగభూషణం తెలిపారు. జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు డీఎస్పీ నాగభూషణం, పట్టణ సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున పట్టణంలోని 18వ వార్డ్ సుందరయ్య నగర్ లో పట్టణ పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని ముప్పై ఐదు ద్విచక్రవాహనాలు, మూడు ట్రాక్టర్లు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలపై, పాత నేరస్తుల కదలికపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. స్దానికంగా ఎలాంటి గొడవలకు పోకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వుండాలని సూచించారు. నేరాల నివారణ చర్యల్లో భాగంగా స్థానిక ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా వుండాలని, బ్యాంక్ ఖాతా వివరాల కోసం వచ్చే కాల్స్, ఈమెయిల్స్ కు స్పందించవద్దని, ఏ బ్యాంక్ సిబ్బంది అయినా కార్డ్ నంబర్, పిన్, ఓటిపి, సివివి వివరాలను అడగరని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు యాట సైదులు, సతీష్ వర్మ, ట్రాఫిక్ ఎస్ ఐ రవీందర్ నాయక్, ఏఎస్ఐ కుశలవ్,శంకర్ యాభై మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.