నేరేడుచర్ల : ఎవరిల్లైతేనేం అనుకున్నారు కాబోలు చోరులు. తమ పని కానిచ్చేశారు. ఏకంగా 25 తులాల బంగారం, రూ.4 లక్షల నగదు చోరీ చేశారు. అదీ ఎక్కడనుకుంటున్నారు ఏకంగా కానిస్టేబుల్ ఇంట్లోనే ఈ దొంగతనం జరిగింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఇటీవల పలు దొంగతనాలు జరిగాయి. మంగళవారం తెల్లవారుజామున పట్టణంలో నివసిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ గృహంలో జొరబడిన దొంగలు బంగారం, నగదు దోచుకెళ్లారు. పాలకవీడు మండల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బుర్రి ఉపేందర్ స్థానిక ప్రగతి స్కూల్ వెనుకభాగంలో కుటుంబంతో అద్దె గృహంలో ఉంటున్నాడు.
సోమవారం నైట్ డ్యూటీ పై వెళ్ళిన ఉపేందర్ మంగళవారం ఉదయం వరకు స్టేషన్ లోనే ఉన్నారు. భార్య కోటేశ్వరి తన ఇద్దరి కూతుర్లతో సోమవారం కోదాడలో బంధువుల గృహంలో జరిగే ఫంక్షన్ కు గృహానికి తాళం వేసి వెళ్ళింది. గృహంలో ఎవరూ లేని సమయంలో మంగళవారం తెల్లవారుజామున ఇంటి గడియ విరగ్గొట్టి లోనికి చొరబడ్డ దుండగులు బీరువాలో దాచి ఉంచిన రూ.4 లక్షల నగదు 25 తులాల బంగారు వస్తువులు దోచుకెళ్లారు. తాళం పగులగొట్టి తలుపులు తీసి ఉంచిన విషయం మంగళవారం ఉదయం పొరుగున నివాసముంటున్న వారు సమాచారం అందించడంతో కానిస్టేబుల్ ఉపేందర్ గృహానికి వచ్చి నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నేరేడుచర్ల ఎస్సై నవీన్ కుమార్, హుజూర్ నగర్ సిఐ రామలింగారెడ్డి లు సంఘటనా స్థలాన్ని సందర్శించి క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఏకంగా పోలీస్ కానిస్టేబుల్ గృహంలోనే దొంగతనం చోటుచేసుకోవడం.. విలువైన బంగారం… నగదు అపహరణకు గురి కావడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital