మోత్కూర్, సెప్టెంబర్ 8 (ప్రభ న్యూస్) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఓటర్ నమోదును పరిశీలించారు. ధరణి ఎలా పనిచేస్తుందని, పెండింగ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తహశీల్దార్ రాంప్రసాద్ ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఎంపీడీవో మనోహర్ రెడ్డి సెలవులో ఉండగా, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు భువనగిరిలో ఆడిట్ లో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.
మండల పంచాయతీ అధికారి ముషిపట్లలో ఉన్నారని తెలుసుకొని కలెక్టర్ ముషిపట్ల గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీకి చెందిన డంపింగ్ యార్డ్ లో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారా లేదా అని పంచాయతీ కార్యదర్శి క్రాంతిని అడిగి తెలుసుకున్నారు. ఎరువు తయారు చేస్తున్నారని, కొంత చెట్లకు వేస్తున్నారని, మినహా అమ్ముతున్నారని పంచాయతీ కార్యదర్శి కలెక్టర్ కి సమాధానమిచ్చారు. డంపింగ్ యార్డ్ ను, సేంద్రియ ఎరువును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట తహసిల్దార్ డి రాంప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్ ప్రణయ్ కుమార్, మండల పంచాయతీ అధికారి రవుఫ్ అలీ, పంచాయతీ కార్యదర్శి క్రాంతి తదితరులున్నారు.