Sunday, November 3, 2024

NLG: ఎన్నికల నియమావళి పట్ల పౌరులు అవగాహన కలిగి ఉండాలి.. ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట, ప్రభ న్యూస్ : ఎన్నికల నియమావళి పట్ల పౌరులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా నుండి పీయస్ఆర్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్, గాంధీ చౌరస్తా మీదుగా నూతన బస్టాండ్ వరకు జిల్లా పోలీసు, కేంద్ర సాయుధ బలగాలతో పోలీసు కవాతు నిర్వహించారు. ఈ కవాతును ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో నవంబర్ 30న జరిగే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.

ఎన్నికల నియమావళి పట్ల, ఎన్నికల్లో ప్రజల పాత్ర పట్ల ప్రజలకు, పౌరులకు అవగాహన కల్పించడం కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసు ఫ్లాగ్ మార్చ్ (పోలీసు కవాతు) ఏరియా డామినేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి పౌరుడు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాన్నారు. బాధ్యతగా, స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెడితే అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యం పట్ల బాధ్యతతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎవరైనా అల్లర్లు సృష్టించినా, ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర బలగాలు జిల్లా అంతటా కవాతు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బలగాల అధికారులు ప్రభాకర్ సింగ్, గణేష్, జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, సూర్యాపేట డీఎస్పీ లు నాగభూషణం, రవి, ఇన్స్పెక్టర్లు రాజేష్, మహేష్, రాజశేఖర్, అశోక్ రెడ్డి, సర్కిల్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement