Friday, November 22, 2024

సాగర్ ఉప ఎన్నిక – పోస్టల్‌ బ్యాలెట్ ఓట్ల‌పై దృష్టి

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కును వినియో గించుకునే వారికోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం అధికార యంత్రాంగం రెండు వారాల క్రితమే ప్రక్రియ ను ప్రారంభించింది. దివ్యాంగులు, కరోనా బారిన పడిన వారు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, వ్యాధిగ్రస్తులు ఈ ఉప ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ ఎన్నికలో 8వేల మంది ఈ తరహా ఓటును వినియోగించుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సిద్ధమైన వారి జాబితాను గత వారం రోజులపాటు బూత్‌ స్థాయి అధికారుల ద్వారా సేకరించారు. మొత్తం ఏడు మండలాల పరిధిలో 8వేల మంది ఓటు హక్కును వినియోగించుకుంటుండగా, అందులో 1433 మంది పోస్టల్‌ బ్యాలెట్‌కు అంగీకారం తెలిపారు. ఇంటింటికి తిరిగి బ్యాలెట్‌ పత్రాలను సేకరిస్తున్న అధికారులు ఈనెల 14వ తేదీవరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. మూడో క్యాటగిరి అయిన కోవిడ్‌ బాధిత ఓటర్ల సంఖ్య ఇప్పటి దాకా ఒక్కటి కూడా నమోదు కాలేదని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చెబుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు అంగీకరించిన వారి నుంచి పత్రాలు తీసుకునేందుకు ప్రత్యేకంగా 15 బృందాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఇద్దరు పోలింగ్‌ అధికారులు, కానిస్టేబుల్‌, సూక్ష్మ పరిశీలకుడు, వీడియో గ్రాఫర్‌ ఉన్నారు. ఒక్కో బృందం రోజుకు గరిష్టంగా 50 నుంచి 60 బ్యాలెట్‌ పత్రాలను తీసుకుంటుంది. ఈ బృందాలకు తహసీల్దార్లు నేతృత్వం వహిస్తున్నారు. 12డి పత్రంపై సంతకం చేసిన 1433 మంది నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ను సేకరిస్తారు. చిరునామాల ఆధారంగా ఓటర్ల ఇంటికి వెళ్లి పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రం ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. సదరు ఓటరు అందుబాటులో లేనిపక్షంలో మూడోసారి సైతం వారి చిరునామాకు వెళ్లి ఓటు వేయిస్తారు. ఓటర్ల సంఖ్యని బట్టి తిరుమలగిరి, అనుముల మండలాలకు నాలుగు బృందాలను పంపగా, పెద్దవూర, త్రిపురారం మండలాలకు రెండేసి బృందాలను, గుర్రంపోడు, నిడమనూరు, మాడుగులపల్లి మండలాలకు ఒక్కో బృందాన్ని కేటాయించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్ల సమాచారాన్ని ఇప్పటికే అధికారులు ప్రధాన రాజకీయ పక్షాల పార్టీలకు అందజేశారు. ఆసక్తిగల పార్టీల ప్రతినిధులు ఓటు వేసే ప్రక్రియను దూరం నుంచి పరిశీలించవచ్చు. తిరుమలగిరిలో అత్యధికంగా 408 మంది, మాడుగలపల్లిలో అత్యల్పంగా 73 మంది ఓటర్లు బ్యాలెట్‌ పత్రం ద్వారా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ల దగ్గరకు వెళ్లి వారిని ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు, పోలీసుల సమక్షంలో ఓటుహక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. అంగీకారం తెలిపిన ఓటర్లంతా ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారానే ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. 12డి పత్రంపై సంతకాలు పెట్టిన వారిలో కొంతమంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు నిరాసక్తతను వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కాకుండా నేరుగా బూత్‌కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటామని కొంతమంది ఓటర్లు కోరుతున్నా అందుకు రిటర్నింగ్‌ అధికార ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం పోస్టల్‌ బ్యాలెట్‌కు ఒకసారి అంగీకరించిన తర్వాత పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటామంటే కుదరదని అధికారులు తేల్చిచెప్పారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో 765 మంది దివ్యాంగులు, 668 మంది 80 ఏళ్లకు పైబడిన వాళ్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement