Friday, November 22, 2024

అగ్నిపథ్ ను రద్దు చేయాలి : ఎంపీ లింగయ్య యాదవ్

నల్లగొండ : దేశవ్యాప్తంగా అగ్నిపథ్ కు వ్యతిరేకంగా యువత రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేస్తున్న నేపథ్యంలో కేంద్రం దిగి వచ్చి వెంటనే యువత ఆశల్లో నీళ్లు చల్లే అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ సైనికులను బలహీన పరిచే విధంగా అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకొచ్చారని, దీన్ని దేశవ్యాప్తంగా సైనికులు, యువత వ్యతిరేకిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కేవలం నాలుగు సంవత్సరాలే పని చేయించుకొని ఆ తర్వాత పదవీ విరమణ ఇవ్వడం సరైంది కాదన్నారు. భేషజాలకు పోకుండా ఈ పథకంలో కొన్ని మార్పులు చేసి యువత కు ఉపయోగపడే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కేంద్రానికి అప్పగించిందని ఆ భూములను కేంద్రం అమ్మేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర భూములను అమ్మే హక్కు కేంద్రానికి లేదని చెప్పారు. మోదీ తీసుకు వచ్చే పథకాలు ప్రజా వ్యతిరేకంగా ఉంటున్నాయని, గతంలో వ్యవసాయ చట్టాల తీసుకొచ్చి వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. మిర్యాలగూడ మీదుగా వెళ్లే నారాయణాద్రి, నర్సాపూర్, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మిర్యాలగూడలో నిలుపుదల చేసేందుకు ఉన్నత అధికారులకు సిఫారసు చేసినట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వరరావు, చీమల మల్లయ్య యాదవ్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, బాసాని గిరి, ఇలియాజ్, షోయబ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement