Thursday, November 21, 2024

రుణ లక్ష్యాన్ని సాధించాలి : కలెక్టర్ పమేలా సత్పతి

యాదాద్రి : మార్చి 31వరకు రుణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సంక్షేమ శాఖల అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులతో 2021-22 జిల్లా స్థాయి త్రెమాసిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ…
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల రుణ సౌకర్యం, రైతుల పంట రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఈ నెల చివరిలోగా గ్రౌండింగ్ చేపట్టాలని, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో రుణాలు అందించి వారి ఆర్థిక పురోగతికి తోడ్పడాలని సూచించారు. 2021- 22 సంవత్సరానికి సంబంధించి గత డిసెంబర్ 31వ తేదీ వరకు త్రైమాసిక ప్రగతిని సమీక్షిస్తూ, రూ.1993 కోట్లకు గాను రూ.1627 కోట్లు అందించి 82 శాతం ప్రగతి సాధించడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో రూ.1552 కోట్లకు రూ.1057 కోట్లు అందించి 68 శాతం సాధించడం జరిగిందని, ఇందులో వ్యవసాయ దీర్ఘకాలిక రుణాల కింద రూ.717 కోట్ల లక్ష్యానికి రూ.209 కోట్లు అందించి 29 శాతం సాధించినట్లు, పంట రుణాలకు సంబంధించి రూ.835 కోట్లకు గాను రూ.849 కోట్లు అందించి 102 శాతం సాధించినట్లు తెలిపారు. ఎంఎస్ ఎంఈ సూక్ష్మరుణ ప్రగతిలో రూ.219 కోట్లకు రూ.123 కోట్ల రుణాలు అందించి 56 శాతంతో, గృహ రుణాల కింద రూ.46 కోట్ల లక్ష్యానికి రూ.59కోట్లు అందించి 129 శాతం ప్రగతి సాధించినట్లు తెలిపారు.

విద్యా రుణాల కింద రూ.33 కోట్లకు రూ.9 కోట్ల 20 లక్షల మంజూరుతో 28 శాతం, వీధి వ్యాపారులకు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 490 మంది దరఖాస్తు చేసుకుంటే 149 మందికి 20 వేల రూపాయల చొప్పున 30 శాతం లబ్ధి చేకూరిందని తెలిపారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు సంబంధించి 13,063 గ్రూపులకు రూ.387 కోట్లకు గాను రూ.361 కోట్లతో 93 శాతం రుణ సౌకర్యం కల్పించబడిందన్నారు. ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం క్రింద 64 దరఖాస్తులకు గాను ఒక కోటి 74 లక్షల రూపాయలకు సంబంధించి 7 దరఖాస్తులకు 22 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అర్హులైన వారికి రుణాలు అందించడంలో భాగంగా కొత్తగా వచ్చే పరిశ్రమలకు రుణ అవకాశాలు కల్పించాలని సూచించారు. విద్యార్థులను ఫైనాన్షియల్ లిటరసీ అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి విద్యార్థి దశ నుండే బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఇప్పటి వరకు 71 క్యాంపుల ద్వారా ఆర్థిక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ డివో రాజేంద్ర ప్రసాద్, జిల్లా లీడ్ మేనేజర్ రామకృష్ణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగ్తా నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి. శ్యాంసుందర్, జిల్లా పశుసంవర్ధక అధికారి, మెప్మా పి.డి.రమేష్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement