Tuesday, November 26, 2024

సాగ‌ర్ ఉప ఎన్నిక‌పై కెసిఆర్ స్పెష‌ల్ ఫోక‌స్….

ఎప్పటికపుడు పరిస్థితులు ఆరా
ఇన్‌ఛార్జిల పనితీరుపైనా నివేదికలు
నిర్లక్ష్యంగా ఉన్నవారికి నేరుగా ఫోన్‌లు
బహుముఖ అస్త్రాలు.. నేరుగా పర్యవేక్షణ
10, 11 తేదీల్లో కేటీఆర్‌ రోడ్‌షోలు

న‌ల్గొండ‌ : గులాబీ దళపతి సీఎం కేసీఆర్‌ నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికను లైట్‌గా తీసుకోవడంతో.. ఎదురైన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని సాగర్‌లో బహుముఖ వ్యూహాలతో టీఆర్‌ ఎస్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రతిరోజూ నివేదికలు తెప్పించు కోవడంతో పాటు సరికొత్త ఎత్తులతో ప్రత్యర్థు లకు చుక్కలు చూపిస్తున్నారు. సొంత పార్టీ నేతలకు.. స్థానిక పరిస్థితులు, నేతల ప్రచారాన్ని తెలుసుకుని.. నేరుగా ఫోన్‌ చేస్తున్నారు. కేటాయించిన ప్రాంతంలో మకాం వేయని వారిని, చెప్పిన గ్రామంలో ప్రచారం చేయని వారిని.. సమావేశాలు నిర్వహించని వారిని సీఎం నేరుగా ఫోన్‌చేసి మందలిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు పరుగులు తీస్తున్నారు. పనితీరును బేరీజు వేసి.. కొందరు ఎమ్మెల్యేలను ఒక మండలం నుండి ఇంకో మండలానికి మార్చారు. నోముల భగత్‌ నామినేషన్‌ కోసం మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, హోంమంత్రి మహమూద్‌ అలీలు మార్చి 30న నాగార్జున సాగర్‌కు వెళ్ళారు. నామినేషన్‌ కార్యక్రమం ముగిశాక.. ఇక హైదరాబాద్‌కు బయల్దేరుదామనుకున్న సమయంలో సీఎం కేసీఆర్‌ ఫోన్‌చేసి ప్రచారం ముగిసేవరకు సాగర్‌ను వదిలిపెట్టి రావొద్దని ఆదేశించారు. సీఎం ఆదేశం మేరకు తలసాని నాగార్జునసాగర్‌లోనే మకాం వేశారు. మహమూద్‌ అలీ కూడా.. అక్కడే ఉన్నారు. ఓ ఎన్నిక కోసం ఈ ఇద్దరు మంత్రులు 15రోజులు మకాం వేసి ప్రచారం చేయడం ఇదే ప్రథమం. ఇప్పటికే వారానికి పైగా గడిచిపోయింది. క్షేత్రస్థాయిలో సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ యాదవ సామాజిక వర్గ ఓట్లలో చీలిక రాకుండా, టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు, క్యాడర్‌ నిరుత్సాహపడకుండా తలసాని అస్త్రాన్ని సీఎం ప్రయోగించారు. మైనారిటీల ఓట్లు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయన్న సమాచా రంతో.. టీఆర్‌ఎస్‌ వైపునకు పూర్తిగా తిప్పేందుకు మహమూద్‌ అలీని స్థానికంగానే ఉండమని సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎమ్మెల్యేలు, ఆర్యవైశ్య కార్పోరేషన్‌ చైర్మన్లు.. ఆయా పరిస్థితులు, ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు అన్ని అవకాశాలను వినియోగిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల పీఆర్‌సీ ప్రకటించి, ఉద్యోగ విరమణ వయసు పెంచి వరాల జల్లు కురిపించగా, సాగర్‌ నియోజకవర్గంలోని టీఎన్‌జీవోలం దరినీ ఏకం చేసి ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం సమావేశం నిర్వహించారు. వేతనం పెరిగిన అన్నివర్గాల నేతలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రచారానికి ఎక్కువగా యువ ఎమ్మెల్యేలను, ముఖ్యనేతల వారసులను రంగంలోకి దింపగా.. ప్రతీ సూక్ష్మ అంశాన్ని పర్యవేక్షిసు న్నారు. ఎవరైనా వారికి కేటాయించిన మండలంలో ప్రచారం చేయకున్నా, ఆదేశించిన సమావేశం నిర్వహించ కున్నా.. నాగార్జునసాగర్‌ నియోజకవర్గం దాటి బయటకు వచ్చినా నేరుగా ముఖ్యమంత్రి నుండి ఫోన్‌ వస్తుండ డంతో నేతలు హడలిపోతున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటూ సీఎం ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలుచేస్తుండగా.. మొత్తం ప్రచారాన్ని, ప్రణాళికను నియోజకవర్గ ఇన్‌ఛార్జి, జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. రోడ్‌షోలు, గ్రామాల పర్యటనలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
కేటీఆర్‌ రోడ్‌షోలు
ఈనెల 10, 11 తేదీలలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రోడ్‌షోలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. కేటీఆర్‌ రోడ్‌షోలతో.. ప్రచారం మరో లెవెల్‌కు వెళుతుందని భావిస్తున్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలోనూ.. స్టార్‌ క్యాంపెయినర్‌గా కేటీఆర్‌ ప్రచారాన్ని అదరగొట్టి ప్రజలను ఆకట్టుకున్నారు. కేటీఆర్‌ రోడ్‌షోల తర్వాత అవసరాన్ని బట్టి సీఎం కేసీఆర్‌ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. 14వ తేదీన సభ నిర్వహణపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement