నల్లగొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలని డీఐజీ ఏవీ రంగనాథ్ పోలింగ్ సిబ్బందికి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బందితో శనివారం నాగార్జున డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలింగ్ సమయంలో పాటించాల్సిన నియమాలను వారికి వివరించారు. బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు చేర్చడం, పోలింగ్ అనంతరం స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లోని పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఎక్కడ సమస్య తలెత్తినా నిమిషాల్లో అక్కడికి చేరుకునేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 130 పోలింగ్ కేంద్రాలను 22 రూట్లుగా విభజించి 1,135 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓ ఎస్పీ స్థాయి అధికారి, ఇద్దరు అదనపు ఎస్పీలు, అయిదుగురు డీఎస్పీలు, 29 మంది సీఐలు, 56 మంది ఎస్ఐలు, 124 మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, 210 మంది కానిస్టేబుళ్లు, 564 మంది మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులతోపాటు 126 మంది ఏఆర్ సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని డీఐజీ రంగనాథ్ వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement