కమిషనర్ చాంబర్ లో బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
భూపాల్‌రెడ్డితో సహా పలువురి అరెస్టు
కాంగ్రెస్ నాయకులు చెబితే అరెస్టు చేస్తారా? : బీఆర్ఎస్ ప్రశ్న
నల్లగొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : నల్లగొండ మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మునిసిపల్ సిబ్బంది తొలగించడాన్ని ప్రశ్నించేందుకు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నేతృత్వంలో పలువురు బీ ఆర్ఎస్ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కమిషనర్ లేకపోవడంతో భూపాల్ రెడ్డి తో పాటు పలువురు కార్యకర్తలు బైఠాయించారు. బైఠాయించిన వారిలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ తదితరులు ఉన్నారు.
భూపాల్‌రెడ్డితో సహా పలువురి అరెస్టు
మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బీఆర్ఎస్ నేతలను కోరారు. కమిషనర్ వచ్చేంతవరకూ తాము కదిలేదీ లేదని భూపాల్ రెడ్డి తెగేసి చెప్పారు. దీంతో బైఠాయించిన కార్యకర్తలను బలవంతంగా బయటికి లాక్కెళ్లారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆదేశాలతో తమను ఎలా అరెస్టు చేస్తారంటూ కంచర్ల భూపాల్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులతో జరిగిన పెనుగులాటలో కంచర్ల భూపాల్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు బలవంతంగా ఆయనను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయన అరెస్టును అడ్డుకునేందుకు యత్నించిన బీ ఆర్ఎస్ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ నాయకుల మాటలు విని వారికి తొత్తుల్లలా వ్యవహరించవద్దని భూపాల్ రెడ్డి నినాదాలు చేశారు.