Friday, November 22, 2024

Nalgonda – ఎస్ఎల్బీసీ ట‌న్నెల్ నిర్మాణానికి వేగవంతం … అమెరికా నుంచి మెషీన్లు – మంత్రి కోమటిరెడ్డి

విద్యుత్ స‌బ్‌స్టేష‌న్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన మంత్రి
ప్ర‌జాద‌ర్బార్‌లో విన‌తుల స్వీక‌ర‌ణ‌
ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంలో స‌మీకృత వ‌స‌తి గృహం
న‌ల్ల‌గొండ‌లోని ప్రాజెక్టుల‌కు అధిక నిధుల కేటాయించినట్టు వెల్లడి

ఆంధ్రప్రభ స్మార్ట్​, నల్గొండ ప్రతినిధి: నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం కోసం త్వరలో అమెరికా నుంచి యంత్రాల‌ను తెప్పించనున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. శుక్రవారం నల్లగొండ మండలంలోని దొనకల్ గ్రామంలో రూ 3 కోట్లతో నిర్మించనున్న 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నల్లగొండ పట్టణంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఆయాన ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వాలు మునుపెన్నడు వ్యవసాయ రంగానికి కేటాయించని విధంగా బడ్జెట్లో 72,659 కోట్లను కేటాయించామ‌న్నారు. రూ 31 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 80 కోట్ల రూపాయల వ్యయంతో 20 ఎకరాలలో సమీకృత వసతి గృహ నిర్మాణాలను చేపడతామని చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగం, బ్రాహ్మణ వెల్లంల, శివన్న గూడెం, పాలమూరు రంగారెడ్డి , సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో అధిక నిధులను కేటాయించిందని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు.

- Advertisement -

కాగా, తెలంగాణ బడ్జెట్‌పై గగ్గోలు పెడుతున్న కేసీఆర్ కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి రెడ్డి డిమాండ్ చేశారు. . తెలంగాణకు బడ్జెట్‌లో అన్యాయం చేస్తే కేంద్రంపై ఇప్పటికి కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. బడ్జెట్‌లో కేటాయింపుల విషయంలో జరిగిన అన్యాయాన్ని అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి ఖండించారని గుర్తు చేశారు. బీజేపీ వైపు బీఆర్ఎస్ అడుగులు పడుతున్నాయ‌ని అందుకే తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెట్టినా నోరు మెదపడం లేదని ఆరోపించారు.

ఏపీ, బీహార్‌లలో ఎన్డీయేకు మద్దతు ఇచ్చినందుకే భారీగా నిధులు కేటాయించారన్నారు. వారు మద్దతు ఉపసంహరించుకుంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని అప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్నారు. ఆ భయంతోనే బీజేపీ ఆ రెండు రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిపిందన్నారు. తాము నీతి అయోగ్ మీటింగ్‌కు అసెంబ్లీలోనే తేల్చి చెప్పామని.. కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఫైర్ అయ్యారు. వ్యవసాయ రంగానికే రూ.73 వేల కోట్లు బడ్జెట్‌లో తాము ఉంచామని అయినా బీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. కేవలం 6 నెలల కోసమే తమ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని బడ్జెట్‌లో పెట్టిందని, చెప్పిన పథకాలతో పాటు కొత్త వాటిని కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement