ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాల కారణంగా మనస్థాపంతో ఇంట్లో నుండి వెళ్లిపోయిన మహిళను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు నల్గొండ జిల్లా యాంటీ హ్యూమాన్ ట్రాఫికింగ్ పోలీసులు. మిస్సింగ్ కేసులను ఛేదించడం లక్ష్యంగా డిఐజి ఏ.వి. రంగనాధ్ నేతృత్వంలో పెండింగ్ లో ఉన్న కేసులన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ బాధిత కుటుంబాలలో సంతోషాలు నింపుతున్నారు జిల్లా పోలీసులు. ఇందులో భాగంగా కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో ఇంటి నుండి వెళ్లిపోయిన మహిళను అదనపు ఎస్పీ నర్మద సమక్షంలో సోమవారం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.
డిసెంబర్ 2020లో నల్లగొండ జిల్లా ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన ఎం.డి.రెజీనా కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో మనస్థాపం చెంది ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మహిళ హైదరాబాద్ మీర్ పేటలోని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పని చేస్తున్నట్లుగా గుర్తించి తీసుకువచ్చి సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మిస్సింగ్ కేసు ఛేదించడంలో సమర్ధవంతంగా పని చేసిన ఏ.హెచ్.టి.యు. ఇంచార్జ్ రాంబాబు, సిబ్బంది నర్సింహా, మధు, నజీర్, బాలయ్య, సాయి సందీప్, జ్యోతిలను డిఐజి ఏ.వి. రంగనాధ్, అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద అభినందించారు.