Thursday, January 30, 2025

Nalgonda – స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ముగియ‌గానే రైతు భ‌రోసా బంద్ – కేటీఆర్

మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేది మేమే
వేధింపుల‌కు గురిచేస్తున్న పోలీసుల‌కు వ‌డ్డీతో స‌హా చెల్లిస్తాం
కేసీఆర్ 11 విడ‌త‌ల్లో రూ.73 వేల కోట్ల రైతుబందుగా అంద‌జేశారు
మంత్రి కోమ‌టిరెడ్డికి ద‌మ్ముంటే గ‌డియారం సెంట‌ర్‌లో మీటింగ్ పెట్టి మాట్లాడాలి
ధాన్యం దిగుబడిలో నల్లగొండ జిల్లాను నెంబర్ వన్ స్థానంలో నిలిపింది కేసీఆరే
నల్లగొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ ప్రెసిడెంట్‌ కేటీఆర్

నల్లగొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను నిలిపివేస్తుందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్ లో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. కేసీఆర్ హ‌యాంలో 11 విడతలుగా రైతుబంధు పథకం కింద రైతుల అకౌంట్లలో రూ. 73 వేల కోట్లను వేసిన‌ట్లు గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ అని, రైతుబంధు అంటే కేసీఆర్ అని గుర్తొస్తారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప‌దేప‌దే చెబుతున్నార‌ని, ఆ కుట్రలో భాగంగానే కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని బందు చేయాలని యత్నిస్తున్నార‌ని ఆరోపించారు.

కాంగ్రెస్‌ను నిల‌దీయండి
అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15000 ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎకరానికి రూ. 12000 మాత్రమే ఇస్తానని మోసం చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కొక్క ఎకరానికి రూ. 17,500 బాకీ ఉందని, ఆ డబ్బు చెల్లించాలని కాంగ్రెస్‌ను రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. సాయుధ తెలంగాణ పోరాటంలో నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని, రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మరోసారి నల్లగొండ జిల్లా వేదికగా మారాలని అన్నారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో న‌ల్ల‌గొండ జిల్లా స‌స్య‌శ్యామ‌లం
నీళ్లు లేక తీవ్ర కరువుతో అల్లాడిన ఉమ్మడి నల్లగొండ జిల్లాను కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో సస్యశ్యామలమైన జిల్లాగా మార్చిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. ఈ ప్రాజెక్టు నీటితో టేయిలాండ్ ప్రాంతాలైన తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో నూటికి నూరు శాతం రైతులకు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శాసనసభలో సవాలు విసిరినా రేవంత్ రెడ్డి తోకముడిచార‌ని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లి, లేదా కొడంగల్ నియోజకవర్గాలకు వెళ్లి రైతులతో బహిరంగ విచారణ చేద్దామని నూటికి నూరు శాతం రుణమాఫీ జరిగిందంటే తాను రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శాసనసభ ఎన్నికల ముందు కేసీఆర్‌ రైతులకు రైతుబంధు చెల్లించేందుకు రూ .7600 కోట్లు అకౌంట్ లో సిద్ధంగా ఉంచితే కేసీఆర్‌కు ఎక్కడ ఓట్లు పడతాయోనన్న దుర్బుద్ధి తో ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి రైతు బంద్ ను ఆపేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.

- Advertisement -

రుణ‌మాఫీ రూ.26 వేల కోట్ల‌కు కుదించిన ప్ర‌భుత్వం
రైతు రుణమాఫీకి మొదట రూ. 49,500 కోట్లు అవసరమని చెప్పిన ప్రభుత్వం దానిని రూ.26 వేల కోట్లకు తగ్గించిందని, ఇందులో కేవలం రూ. 12 వేల కోట్ల రూపాయలను మాత్రమే చెల్లించిందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో కేవలం 25 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వ‌ర్తించిద‌ని కేటీఆర్ తెలిపారు. జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరాచకాలు పెరిగాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై పోరాటం చేస్తున్న కంచర్ల భూపాల్ రెడ్డి ని కోమటిరెడ్డి అరెస్టు చేయించడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి కి దమ్ముంటే గడియారం సెంటర్ లో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు చేసిన మేలు ఏంటో ప్రకటించాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్న పోలీసులు
కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లతో బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమ కేసులను బనాయిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. పోలీసులు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆరు హామీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రజల నుండి దరఖాస్తులను తీసుకుంటూ కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో ఎవరూ ఆనందంగా లేకున్నా కేవలం జిరాక్స్ సెంటర్ల యజమానులు మాత్రం ఆనందంగా ఉన్నారని కేటీఆర్ చలోక్తి విసిరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement