నల్లగొండ : నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి 80లక్షల విలువగల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు నల్లగొండ నార్కట్‌పల్లి పోలీసులు , వ్యవసాయశాఖ అధికారులు, టాస్క్‌ఫోర్సు సిబ్బంది బుధవారం ఉదయం 5 గంటలకు నార్కట్ పల్లి ఫ్లై ఓవర్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు.. అనుమానస్పదంగా వస్తున్న ఎర్టిగా కారును తనిఖీ తనిఖీ చేయగా అందులో రెండు బస్తాలలో విడి విత్తనాలు ఉండడాన్ని గమనించారు. అవి నకిలీ పత్తి విత్తనాలుగా తేలడంతో కారులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. కర్ణాటక లో కొంత మంది రైతుల దగ్గర నుంచి నకిలీ పత్తి విత్తనాలు తక్కువ ధరకు కొనుగోలు చేసి గుంటూరు జిల్లా దాచపల్లి దగ్గర స్టోరేజ్ చేశారని ఎస్పీ తెలిపారు. అక్కడి నుంచి మహారాష్ట్ర లోని నాగపూర్‌కు తరలిస్తుండగా నార్కట్ పల్లి వద్ద పట్టుకున్నామన్నారు.
సికింద్రాబాద్‌లోని అల్వాల్ హిల్స్‌కు చెందిన వ్యాపారి గోరంట్ల నాగార్జున, ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన గడ్డం రవీంద్రబాబు, నంద్యాల జిల్లాకు చెందిన మెరిగే వేణును అరెస్టు చేసినట్లు వివరించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన నరసింహఅనే వ్యక్తి పరారీలో ఉన్నారని ఎస్పీ వెల్లడించారు. రైతులను మోసం చేసే వారిపై చర్యలకు ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు అమ్మినా, సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై పీడీ యాక్ట్‌ను పెడతామని ఆమె హెచ్చరించారు.
ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన నల్లగొండ డీఎస్పీ నరసింహ రెడ్డి, చిట్యాల సీఐ శివ రామ్ రెడ్డి, నార్కెట్ పల్లి ఎస్‌ఐ సైదా బాబు, చిట్యాల ఎస్‌ఐ రవి, ఎసై విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ సురేందర్, కానిస్టేబుల్స్ శివ శంకర్,గిరిబాబు, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు