Monday, September 16, 2024

Nalgonda – పేద ప్రజలకు వైద్య సేవలు చేరువ కావాలి…కలెక్టర్ ఆర్.వి. కర్ణన్.

నల్లగొండ, ప్రభ న్యూస్ ప్రతినిధి. — జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వైద్య సేవలు పేద ప్రజలకు చేరువ కావాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ పని తీరు పై ఆయన ఆ శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ల తో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సబ్ సెంటర్ల భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 257 సబ్ సెంటర్లు ఉన్నాయని అంటూనే వాటిల్లో 52 సెంటర్లు ప్రభుత్వ భవనాల్లో మరో 205 సెంటర్లు ప్రైవేట్ భవనాల్లో పని చేస్తున్నట్లు జిల్లా వైద్య శాఖ అధికారి వివరించారు. 164 సబ్ సెంటర్ల కు భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం మంజూరు ఇవ్వగా అందులో 24 భవనాల నిర్మాణం తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా నిర్మాణం చేపట్టినట్లు, అందులో భాగంగా 7 భవనాల నిర్మాణం పూర్తి అయినట్లు వైద్య అధికారులు వివరించారు. మిగతా సబ్ సెంటర్ల భవనాల నిర్మాణాన్ని పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపట్టినట్లు చెప్తూనే నిర్మాణ పనులు వివిధ దశల్లో లో పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సబ్ సెంటర్ల భవనాల నిర్మాణాలను మానిటర్ చేయడానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని డీఎంహెచ్ఓ ను ఆదేశించారు. ఏరియా ఆసుపత్రుల్లో సీమాంక్ సెంటర్లలో ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్లను వారం రోజుల్లో నియమించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలని సూచించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో హియరింగ్, డెంటల్, ఆప్తమాలిక్ విభాగాల పని తీరుపై సమీక్షించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి లో ఎర్లీ ఇంటర్ వెన్షన్ సెంటర్ లో సైకాలజిస్ట్ ఖాళీని వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. గర్భస్త భ్రూణ హత్యలు జరగకుండా వైద్య అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను మానిటర్ చేయాలని సూచించారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ లో 134 రకాల పరీక్షలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్.సి.డి. క్లీనిక్ లలో డాక్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలలో 58 శాతం సాధారణ ప్రసవాలు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 42 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నట్లు వివరించారు. డెంగ్యూ, క్షయ వ్యాధి కేసులపై సమీక్షించారు. జిల్లాలో 15 డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో హెచ్ఐవి నిర్థారణకు ఎలిసా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు, ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు నాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణు గోపాల్ రెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృ, మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement