Friday, November 22, 2024

Nalgonda జడ్పి చైర్మన్ పై దాడి ఆటవిక చర్యే – జగదీష్ రెడ్డి

నల్గొండ – మంత్రి హోదాలో ఉండి ఆటవికంగా ప్రవర్తించడం కోమటిరెడ్డికే చెల్లిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి lఎద్దేవా చేశారు. భువనగిరి జడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై జరిగిన దాడియే ఆయన ఆటవిక ప్రవర్తనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన అధికారిక పర్యటనలో పాల్గొన్న జడ్పి చైర్మన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు..

సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో , రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి వై వెంకటేశ్వర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటవికంగా దాడి జరుగుతున్నప్పుడు రక్షించాల్సిన పోలీసులే జడ్పి చైర్మన్ హోదాలో ఉన్న సందీప్ రెడ్డిని నెట్టి వేయడం దురదృష్టకరమన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిజిపిని డిమాండ్ చేశారు..

మంత్రి హోదాలో ఉన్న కోమటిరెడ్డి సత్ప్రవర్తనతో ఉంటారనుకుంటే అందుకు భిన్నంగా ఆటవికంగా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతటి అహంకారం ఎప్పటికీ ఆరోగ్యకరం కాదని ఆయన హితవు పలికారు. చైతన్యాన్ని పుణికి పుచ్చుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు తలకెక్కిన అహంకారాన్ని కిందకు దించుతారని అన్నారు..

కోమటిరెడ్డి చేసిన దీక్ష తెలంగాణ కోసం ఎంత మాత్రం కానే కాదని ఆయన తేల్చి చెప్పారు. నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి ని ఖచ్చితంగా మంత్రి పదవి నుండి తొలగిస్తారని తెలుసుకునే దీక్ష జపం మొదలుపెట్టారని ఆయన ఆరోపించారు. ఊడిపోయే పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం రాజీనామా అన్నట్లు నమ్మ పలికే విధంగా త్యాగాల ట్యాగ్ ను పదేళ్ల నుండి మెడకేసుకుని తిరుగుతున్నాడని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ బూట్లు నాకుతూ పదవులు కాపాడుకునేందుకు ప్రసన్నం చేసుకున్న చరిత్ర కోమటిరెడ్డిది అని ఆయన ఘాటుగా విమర్శించారు.

ఇదేనా ప్రజాపాలన ? హరీష్ రావు

- Advertisement -

కాంగ్రెస్ ‘ప్రజాపాలన”లో సాటి ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్న మంత్రుల వైఖరి గర్హనీయం.మొన్న రైతు బంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టండని పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నేడు యాదాద్రి భువన గిరి జెడ్పి ఛైర్మన్ సందీప్ రెడ్డి పై అధికారిక కార్యక్రమం లో అకారణంగా దుర్భాష లాడటం కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనం అని హరీష్ రావు అన్నారు.

మాట్లాడింది చాలదన్నట్టు మంత్రి పోలీసులకు హుకుం జారీ చేసి బలవంతంగా సందీప్ రెడ్డి ని బయటకు పంపిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. . ప్రజాస్వామ్య వాదులంతా కోమటి రెడ్డి పోకడలను తీవ్రంగా ప్రతిఘటించాలని,. కోమటి రెడ్డి కి ప్రజాస్వామ్యం మీద ఏ మాత్రం నమ్మకమున్నా ..జిల్లా పరిషత్ ఛైర్మన్ సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement