Saturday, November 16, 2024

Nalgonda – రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి … జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్..

నల్లగొండ, ప్రభ న్యూస్ ప్రతినిధి… జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రి లో కలియ తిరుగుతూ వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి లో తొలుత ఎమర్జెన్సీ వార్డ్ ను సందర్శించారు. తదుపరి పోలియేటివ్ కేర్ విభాగం సందర్శించి అక్కడి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు సరిగా అందుతున్నాయా, మందులు ఇస్తున్నారా, ఎన్ని రోజులు నుండి ఆసుపత్రిలో ఉన్నారు లాంటి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలియెటివ్ కేర్ యూనిట్ లో డాక్టర్ రోగులకు అందు బాటులో ఉంటూ రోగులను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు.

అలాగే జిల్లాలో ఉన్న క్యాన్సర్ రోగుల గురించి , వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి డాక్టర్ లను ఆరా తీశారు. మండల పీ హెచ్ సీ ల వారీగా పోలియేటివ్ కేర్ రోగుల జాబితా అందించాలని ఆదేశించారు. ఎంత మంది దీర్ఘ కాలిక రోగులు ఉన్నారు, వారికి అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మేల్ మెడికల్ వార్డ్ ను సందర్శించారు. డయాలసిస్ యూనిట్ లో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులు బయట నుండి మందులు తెచ్చుకుంటున్నామని చెప్పడంతో ఆయన అక్కడి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు రోగులకు ఆసుపత్రి లోనే మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎంసీహెచ్ వార్డ్ ప్రసూతి గదులు, అంటి నాటల్ పరీక్ష గది, లేబర్ రూం లు, ఆపరేషన్ థియేటర్లను కలెక్టర్ పరిశీలించారు. రోజుకు ఎన్ని డెలివరీ లు జరుగుతున్నాయని వివరాలు అడిగారు. కాగా మే లో 601,జూన్ నెలలో 534 డెలివరీ లు జరిగాయని అక్కడి వైద్యులు తెలిపారు. అంతే కాకుండా ఏరియా ఆసుపత్రుల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేసినట్లు చేసినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణు గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement