చంచల్‌గూడ జైలులో ఓ ఖైదీ కడుపు నొప్పితో విలవిలాడుతుండడంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకవచ్చారు జైలు అధికారులు. కడుపు నొప్పితో బాధపడతుండడం చూసిన వైద్యులు ఎక్స్‌రే తీయాలని నిర్ణయించుకున్నారు. పరీక్షించిన వైద్యులు అతని కడుపులో మేకులు, టేపు చుట్టలు ఇతర వస్తువులను చూసి షాక్ గురయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడుపు నొప్పితో బాధపడుతున్న ఖైదీ ఎండీ సొహైల్(21)ను చంచల్‌గూడ జైలు ఎస్కార్టు పోలీసులు ఈ నెల 8న ఉస్మానియాలో చేర్పించారు. జనరల్ సర్జరీ యూనిట్-7 వైద్యులు ఎక్స్‌రే తీసి పరిశీలించారు. రెండు మేకులు, షేవింగ్ బ్లేడు, ఇతర చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు బి.రమేశ్‌కుమార్ ఎండోస్కోపీతో విజయవంతంగా వాటిని బయటకు తీశారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని సూపరింటెండెంట్ డా.బి.నాగేందర్ తెలిపారు. అయితే.. జైలు నుంచి బయటికి రావడానికే సొహైల్ వాటన్నింటినీ మింగి ఉంటాడని జైలు అధికారులు భావిస్తున్నారు.