- తుడుం పూజలకు మెస్రం వంశీయులు రెడీ
- 28న మహా పూజలతో కేస్లాపూర్ జాతర ఉత్సవాలు
ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్ లో కొలువైన ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఉత్సవాలను ప్రభుత్వ పండుగగా గుర్తించింది. శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా, ఎస్పీ గౌస్ అలం, ఉట్నూర్ ఏఎస్పి కాజల్ నాగోబా ఆలయాన్ని దర్శించుకుని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చే భక్తుల కోసం ఘనంగా ఏర్పాట్లు ఉండాలని, లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయాలని సూచించారు.
రేపటి నుంచి తుడుం పూజలు.. 28న జాతర షురూ..
నాగోబా జాతర ఉత్సవాలను ఆదివాసీలు సంప్రదాయ, ఆచార వ్యవహారాలతో నిర్వహించనున్నారు. ఇప్పటికే పవిత్ర గోదావరి జలాన్ని కాలినడకన తీసుకొని వచ్చిన మెస్రం వంశస్థులు శనివారం కేస్లాపూర్ కు చేరుకోనున్నారు. రేపటి నుండి మూడు రోజులపాటు తూమ్ పూజలు నిర్వహించి, 28వ తేదీన రాత్రి పది గంటలకు మహా పూజ తో జాతర ఉత్సవాలు ప్రారంభంకా నున్నాయి. ఆదివాసీలు తీసుకువచ్చిన పవిత్ర గంగాజలాలతో నాగోబాను అభిషేకించనున్నారు. ఈ జాతర ఉత్సవాలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో గిరిజనులు తరలిరానున్నారు.