ఆంధ్రప్రభ స్మార్ట్, నల్లగొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో గణనీయంగా ఇన్ ఫ్లో తగ్గడంతో అధికారులు 26 క్రస్ట్ గేట్లను మూసివేశారు. ఇన్నాళ్లు పాల నురుగు లాంటి జల సవ్వడితో వేలాదిమంది పర్యాటకులను తన దగ్గరకు రప్పించుకున్న సాగర్ ప్రాజెక్ట్ బుధవారం నిశ్శబ్దంగా మారింది.
బుధవారం మధ్యాహ్నం నాటికి ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 43,068 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590 అడుగుల కు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 589 అడుగులకు చేరింది. వివిధ అవసరాల నిమిత్తం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో గా వస్తున్న నీటిని అంతే మొత్తంలో అధికారులు బయటకు వదిలిపెడుతున్నారు. రైట్ కెనాల్ నుంచి 9,104 క్యూసెక్కులు, ఎడమ కాలు నుంచి 2210 క్యూసెక్కులు, పవర్ హౌస్ నుంచి 29,354 క్యూసెక్కులు, ఏ ఎం ఆర్పీ నుంచి 1800 క్యూసెక్కులు, ఎల్ ఎల్ సి నుంచి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.