నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. దీంతో ఆయకట్టు రైతాంగానికి సకాలంలో నీరు అందుతోందని అన్నారు. ఎడమ కాలువ ద్వారా జూలై సమయంలో నీటిని విడుదల చేయడం రెండు దశాబ్దాల కాలంలో ఇదో రెండో సారి అని అన్నారు. కాగా ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత ఇదే మొదటి సారి అని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 6.50 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు రచించామని అన్నారు.
ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 6.16 లక్షల ఏకరాలలో సాగు అందిస్తామని అన్నారు. అలాగే నల్లగొండ జిల్లాలో 1.45,727 ఎకరాలు, సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2,41,000 వేల ఎకరాలు (ఎత్తిపోతల తో కలుపుకొని) అందిస్తామని అన్నారు. టీఎంసీల వారీగా చూస్తే నల్లగొండ జిల్లాకు 18 టీఎంసీలు, సూర్యాపేట జిల్లాకు 18 టీఎంసీలు, ఖమ్మం జిల్లాకు 29 టీఎంసీలు వస్తుందని చెప్పారు. సాగర్ జలాశయానికి గతేడాది పోలిస్తే నీరు మరింత అదనంగా వచ్చి చేరుతోందని అన్నారు. దీంతో ఆయకట్టు రైతులు సంబురాలు చేసుకుంటున్నారని తెలిపారు.