హైదరాబాద్, ఆంధ్రప్రభ : పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకున్న 532 మంది టీచర్లకు బదిలీలకు ఆమోదం తెలుపుతూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో 2538 మంది టీచర్లు, ఉద్యోగులకు సంబంధించిన పరస్పర బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, సోమవారం మరో 532 మందికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం గతేడాది 317 జీవోను అమలు చేసింది. ఈనేపథ్యంలోనే ఉపాధ్యాయుల స్థానికతను ధ్రువీకరిస్తూ కొంత మందిని కొత్త జిల్లాలకు కేటాయించింది. దీంతో పరస్పర బదిలీలకు అనుమతించాలని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఒత్తిడి చేశాయి. అందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే పరస్పర బదిలీలు కోరుకునేవారికి పాత సర్వీసును కొనసాగించబోమని, కొత్తగా చేరినప్పటి నుంచే సర్వీసు పరిగణలోకి తీసుకుంటామని మార్గదర్శకాలను అప్పట్లో వెలువరించింది. అయితే ఈ విషయంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో కోర్టు ఏ తీర్పు వెలువరించినా దానికి కట్టుబడి ఉండాలని ఉపాధ్యాయుల నుంచి అంగీకార పత్రం తీసుకున్నారు. ఈక్రమంలోనే పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకున్న టీచర్ల అప్పీళ్లను గత నెలలో ప్రభుత్వం ఆమోదిస్తూ కొంత మందికి బదిలీ చేయగా..సోమవారం మరో 532 మంది టీచర్లకు పరస్పర బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.