Sunday, September 22, 2024

TG: రైల్వే మాజీ ఉద్యోగి హ‌త్య‌.. ఒక‌రి అరెస్టు..

పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 21(ప్రభ న్యూస్): పాలి కుటుంబాలకు చెందిన ఇరువురి మధ్య భూ వివాదాలు హత్యకు దారితీశాయి. భూముల విషయంలో తనకు అడ్డువస్తున్నాడని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథ‌కం ప్రకారం ముగ్గురు సోదరులు కలిసి విశ్రాంత రైల్వే ఉద్యోగిని హత్య చేసిన నిందితుల్లో ఒకరిని పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేసి శనివారం రిమాండ్ కు తరలించారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో శనివారం మీడియా సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి మండలం కొత్తపల్లిలో ఈనెల 19న విశ్రాంత రైల్వే ఉద్యోగి కలవేన రాజేశం(60) హత్యకు గురయ్యాడు. మృతుని కుమారుడు సాయికృష్ణ ఫిర్యాదు మేరకు పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మన్ రావు కేసు నమోదు చేయగా సీఐ ప్రవీణ్ కుమార్ దర్యాప్తు చేశారు.

పోలీసుల విచారణలో కొత్తపల్లి గ్రామానికి చెందిన మృతుని పాలి కుటుంబానికి చెందిన విశ్రాంత సింగరేణి ఉద్యోగి కలవేన లక్ష్మయ్య, అతని సోదరులు కలవేన రాజయ్య, కలవేన మల్లయ్య కలసి హత్య చేశారని నిర్ధారించారు. నిందితుడు లక్ష్మయ్య ప్రస్తుతం తన భార్య, కూతురు, ఇద్దరు కొడుకులతో కలిసి మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం తీగల్ పహాడ్ లో ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు తమ్ముళ్ళు కలవేన రాజయ్య, మల్లయ్య కొత్తపల్లి గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు. నిందితులు ముగ్గురికి కొత్తపల్లిలో పలు సర్వే నెంబర్లలో వ్యవసాయ భూములున్నాయి. వీరికి పాలివారైన మృతుడు కలవేన రాజేశంకు వీరి పక్కనే వ్యవసాయ భూములు, ఇల్లు ఉన్నాయి. గత 15 సంవత్సరాల నుండి వీరికి వ్యవసాయ భూములు, ఇంటి దగ్గర భూముల సరిహద్దుల విషయంలో వివాదాలు తలెత్తాయి. చాలాసార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగి కోర్టులో కూడా కేసులు ఉండి వివాదాలు కొనసాగుతున్నాయి.

ఈక్రమంలో కలవెన లక్ష్మయ్య తన ఇద్దరు తమ్ముళ్ళు రాజేశంపై కక్ష పెంచుకున్నారు. భూ వివాదాలు వారికి అనుకూలంగా మార్చుకోవడం కోసం, కేసుల నుండి ఉపశమనం పొందాలని రాజేశం అడ్డులేకుండా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. లక్ష్మయ్య తన తల్లికి మందులు తీసుకొద్దామని కొత్తపల్లికి రాగా అదే రోజు మృతుడైన రాజేశం తనతో వివాదమున్న కలవేన రాజయ్య భూమి దగ్గర కొలిపిస్తున్నాడని సమాచారం తెలుసుకొని ఇదే అదునుగా నిందితులు భావించారు. రాజేశం తన భూమికి దగ్గరలో ఉన్న రోడ్డుపైన మోటార్ సైకిల్ పార్కింగ్ చేసి తన పొలం పనులు చూసుకొని తిరిగి వస్తుండగా నిందితులు ముగ్గురు అన్నదమ్ములు మాటు వేసి పథకం ప్రకారం రాజేశంతో వాగ్వివాదానికి దిగారు.

- Advertisement -

ముందే ఏర్పాటు చేసుకున్న కర్రతో లక్ష్మయ్య వెనుకవైపు నుండి తలపై కొట్టగా బండిపై నుండి కింద పడిన రాజేశంను అదే కర్రతో తలపై పలుమార్లు లక్ష్మయ్య, మల్లయ్య ఇద్దరు కలిసి కొట్టగా ఆయ‌న‌ అక్కడికక్కడే మరణించాడు. వెంటనే లక్ష్మయ్య, మల్లయ్య, రాజయ్య ముగ్గురు అక్కడి నుండి పారిపోయారు. పక్కా సమాచారంతో నేరస్థుడు లక్ష్మయ్యను కొత్తపల్లి గ్రామంలోని తన ఇంటి వద్ద సిఐ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో వెళ్లి పట్టుకొని విచారించగా.. తన తమ్ముళ్ళతో కలిసి రాజేషంను చంపినట్లు నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి నేరం చేయడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, కర్రను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కలవేన రాజయ్య, మల్లయ్య పరారీలో ఉన్నారు. సాక్ష్యాధారాలు సేకరించి కేసును ఛేదించి నిందితుని పట్టుకున్న పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందిని ఏసీపీ కృష్ణ అభిందించారు. ఈ సమావేశంలో సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లక్ష్మన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement