Tuesday, November 26, 2024

Big Story | ఖమ్మంలో మున్నేరు, భద్రాచలంలో గోదావరి.. ఉగ్రరూపంతో ప్రవ‌హిస్తున్న న‌దులు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో, ప్రభన్యూస్‌ : భారీ వర్షాలు, వరదలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. ఎగువ నుండి వస్తున్న భారీ వరదతో భద్రాచలం వద్ద గోదావరి గురువారం ఉదయం 8 గంటలకు 50.50 అడుగులకు చేరి ఉగ్రరూపాన్ని చూపగా, ఖమ్మం నగరంలో మున్నేరు నది గతంలో ఎన్నడూ లేని విధంగా 30.70 అడుగులతో మహోగ్రరూపాన్ని చూపుతూ పలు ప్రాంతాలను ముంపునకు గురిచేసింది. మున్నేరుకు ఎగువన ఉన్న మహబూబాబాద్‌, వరంగల్‌, డోర్నకల్‌, బయ్యారం, గార్ల తదితర ప్రాంతాల నుండి భారీగా వరదనీరు రావడంతో 40 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ ఉధృతంగా ప్రవహించింది.

దీంతో ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు, మోతీనగర్‌, బొక్కలగడ్డ, వెంకటేశ్వరనగర్‌, పద్మావతినగర్‌, దానవాయిగూడెం, ఎఫ్‌సీఐ, సుందరయ్యనగర్‌, ఖమ్మం రూరల్‌ మండలంలోని జలగం నగర్‌ ప్రాంతాలు ముంపు భారిన పడ్డాయి. క్రమ క్రమంగా మున్నేరు వరద పెరుగుతుండడంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశాలతో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ సురభి, పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ మల్లేశ్వరి తదితర అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను తెప్పించి పడవలు, బోట్‌ల ద్వారా ఇండ్లల్లోకి నీరు చేరిన వారిని తరలించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హుటాహుటిన హైదరాబాద్‌ నుండి ఖమ్మం చేరుకుని మున్నేరు వరదను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. వెంటనే మధ్యాహ్నం 12గంటలకు భద్రాచలం చేరుకుని అక్కడ కలెక్టర్‌, ప్రత్యేక అధికారులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి అప్రమత్తం చేశారు. బుధవారం రాత్రి నుండి క్రమంగా పెరుగుతూ రెండవ ప్రమాద హెచ్చరిక మించి గోదావరి ప్రవహించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ప్రియాంక అల, ప్రత్యేక అధికారి దురిశెట్టి అనుదీప్‌ అధికారులను అప్రమత్తం చేసి వరద ముందపు ప్రాంతాల్లో పర్యటించారు. అప్పటికే హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

- Advertisement -

ఖమ్మంలో ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన

మున్నేరు వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతుండడం, ప్రమాదకర స్థాయికి చేరుతుండడంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఒకవైపు అధికారులను అప్రమత్తం చేస్తూనే మరోవైపు రాజమండ్రి నుండి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను తెప్పించే కార్యచరణ చేపట్టారు. వెంటనే సాయంత్రానికి ఖమ్మం చేరుకుని ఖ మ్మం నగరంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలు ఖాళీ చేసేందుకు సుముఖంగా లేకపోవడంతో కలెక్టర్‌ గౌతమ్‌, పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ సురభి, ఖమ్మం సిటీ పోలీస్‌ ఏసీపీ పివి గణష్‌, ఇతర పోలీసు అధికారులు బలవంతంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మోతీనగర్‌, పద్మావతి నగర్‌, వెంకటేశ్వర నగర్‌ ప్రాంతాల్లో పలువురు ఇండ్ల్లల్లోనే ఉండడంతో వారిని గుర్తించి బలవంతంగా పునరావాస కేంద్రాలకు పంపించారు. సాయంత్రం 6 గంటలకు మున్నేరు వరద కొంత తగ్గి 30.50 వద్ద నిలకడగా ఉండడంతో మంత్రి పువ్వాడ, కలెక్టర్‌ గౌతమ్‌, పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌ స్వయంగా సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతంచేసి పునరావాస కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలకు మున్సిపల్‌ కమిషనర్‌, మేయర్‌, సుడా చైర్మన్‌లను ఆదేశించారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాజెక్టులు, నిలిచిన రాకపోకలు

ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా అన్ని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకలు, ఏర్లు నీటితో ప్రవహిస్తున్నాయి. ఖమ్మం-వరంగల్‌ రోడ్డులో తొర్రూరు వద్ద చెరువుల అలుగు వాగులు రోడ్లపై ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపివేశారు. ఖమ్మం నగరంలో ప్రకాష్‌నగర్‌ బ్రిడ్జి రోడ్డుపై నుండి వరద ప్రవహిస్తుండడం, కాల్వొడ్డు వద్ద మున్నేరు పాత బ్రిడ్జి ప్రమాదకరంగా ఉండడంతో రాకపోకలు బంద్‌ చేశారు. ఖమ్మం-విజయవాడ ప్రధాన రహదారిలో ధంసలాపురం వద్ద వాగు రోడ్డుకు పోటేయడంతో మున్నేరు వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయారు. కొణిజర్ల, చింతకాని మండలాలతో పాటు పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.

పాలేరు పాత చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సూర్యాపేట పాత రోడ్డుపై రాకపోకలు ని లిచాయి. జిల్లాలో పాలేరు, వైరా, కిన్నెరసారి, మూకమామిడి, లంకాసాగర్‌, తాలిపేరు ప్రాజెక్టులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఎవరూ ఉండవద్దని రెండు జిల్లాల్లో టోల్‌ ఫ్రీ నెంబర్లు ప్రకటించి సహాయక చర్యలు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement