Tuesday, November 26, 2024

TS: ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు స్వ‌యంగా రంగంలోకి దిగిన‌ మున్సిప‌ల్, పోలీస్ క‌మిష‌న‌ర్లు…

హైద‌రాబాద్ – జూబ్లీహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో కలిసి జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పర్యటించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45,36 చెక్ పోస్ట్ ప్రాంతాలను పరిశీలించి ట్రాఫిక్ సమస్యను అధిగ మించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు కమిషనర్. ఇక అవసరమైన చోట ఫ్లై ఓవర్, గ్రేడ్ సేపెరేటర్లు చేపట్టేందుకు ప్రణాళిక ను సిద్దం చేయాలని అధికారులను కోరారు.

కాగా,గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై నిన్న జ‌రిగిన‌ స‌మీక్షా స‌మావేశంలో సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.

ఈ నేప‌ధ్యంలోనే జిహెచ్ ఎంసి క‌మిష‌న‌ర్ , హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ లు నేడు న‌గ‌రంలోని జూబ్లీ హిల్స్ తో పాటు వివిద ప్రాంతాల‌లో ప‌ర్య‌టించారు. ట్రాఫిక్ ర‌ద్దీని వారు స్వ‌యంగా ప‌రిశీలించారు. అనంత‌రం రోనాల్డ్ రోస్ మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీస్, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ అధికారుల సమన్వయంతో ప్రణాళిక సిద్దం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement