తెలంగాణలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదటగా బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెల్లడి కానున్నాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. వీటితోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్, మెట్‌పల్లి, అలంపూర్, జల్‌పల్లి, గజ్వేల్, నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్ లో ఒక్కో వార్డుకు ఉపఎన్నిక నిర్వహించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేసిన తర్వాత.. బ్యాలెట్ పెట్టెల్లోని ఓట్లు లెక్కిస్తారు. మూడు నుంచి నాలుగు రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది.
గ్రేటర్ వరంగల్ లోని 66 వార్డుల్లోని ఓట్ల లెక్కింపును మూడు బ్లాక్‌లుగా విభజించారు. లెక్కింపు సజావుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతీ డివిజన్‌కు రెండు టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 1900 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ ఆర్‌వో లెక్కింపును పర్యవేక్షించనున్నారు. ఓట్ల లెక్కింపునకు భద్రతా పరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీపీ తరుణ్ జోషీ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు పోలింగ్ సిబ్బంది, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లకి కొవిడ్ పరీక్షలను పూర్తిచేశారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు నెగెటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది.
ఖమ్మం నగరపాలక సంస్థకు సంబంధించి ఎస్.ఆర్. అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో లెక్కింపు జరగనుంది. 60 డివిజన్లకు గానూ.. 10వ డివిజన్‌ను తెరాస ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో.. 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. లెక్కింపు కోసం ప్రతి డివిజన్‌కు ఓ కౌంటింగ్ అధికారిని నియమించారు. మొత్తం 59 మంది ఆర్వోలు, ప్రతి టేబుల్‌కు ఓ సూపర్ వైజర్‌ను నియమించారు. ఓట్ల లెక్కింపు కోసం 10 హాళ్లు ఏర్పాటు చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీల ఫలితాలు మధ్యాహ్నం 3 గంటల సమయానికి వెలువడే అవకాశం ఉంది. జడ్చర్ల పురపాలిక లెక్కింపు బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరగనుంది. తొలిసారి ఎన్నికలు జరిగిన నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ 20 వార్డుల్లో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సరూర్‌నగర్ వీఎం హోంలో జరగనుంది. ఈ ఎన్నికలో పోటీకి టీఆర్ఎస్ దూరంగా ఉంది.
కాగా, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లలో 500 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 59 డివిజన్లు ఉండగా, 250 మంది బరిలో నిలిచారు. ఖమ్మం కార్పొరేషన్‌లో ఇప్పటికే 10 డివిజన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకు పోలింగ్ జరగగా.. 236 మంది పోటీ చేశారు. జడ్చర్ల మున్సిపాలిటీలో 27 వార్డుల్లో 112 మంది అభ్యర్థులు, అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డులకు 66 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.