నిర్మల్ జిల్లా ముథోల్ డిప్యూటి తహసీల్దార్ సయ్యద్ ఆసీఫ్ (50) గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం విధులు నిర్వహించిన అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన భోజనం చేసి నిద్రించారు. నిద్రావస్థలోనే గుండెపోటు భారిన పడి ఆయన మృత్యువాత పడ్డారు. బుధవారం ఉదయం 8గంటల వరకు సయ్యద్ ఆసీఫ్ బయటకు రాకపోవడాన్ని గుర్తించిన ఇంటి యాజమాని పిలిచినప్పటికీ స్పందన రాలేదు. దీంతో తెరిచి ఉన్న కిటికి నుంచి లోపలికి చూడగా.. డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ ఆసీఫ్ అపస్మారక స్థితిలో పడి కనిపించాడు. వెంటనే యాజమాని సంబంధిత విషయాన్ని తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి సమాచారం అందించారు. వారందరూ ఇంటికి వచ్చి తలుపులు తొలగించి చూడగా అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నాడు.
సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీకి చెందిన సయ్యద్ ఆసీఫ్ గత ఏడాదిన్నర కాలంగా ముథోల్ తహసీల్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గా పని చేస్తున్నాడు. డిప్యూటీ తహసీల్దార్ మృతి చెందిన సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి హుటాహుటిన ముథోల్ కు తరలివెళ్లారు. అక్కడి రెవెన్యూ సిబ్బందికి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహానికి నివాళులు అర్పించారు.