హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎంటెట్, ఎంఈ సీటు కావాలంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్)లో అర్హత సాధించి మంచి ర్యాంకు సాధిస్తేనే కోరుకున్న బ్రాంచీలో సీటు వచ్చేది. ఇది ఇప్పటి వరకు ఉన్న విధానం. కానీ త్వరలోనే ఆ విధానానికి అధికారులు మంగళం పాడనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను తెలంగాణ ఉన్నత విద్యామండలి సిద్ధం చేస్తోంది. కొన్ని కోర్సులకు ఎంట్రెన్స్ లేకుండానే నేరుగా సీటు పొందే విధానాన్ని అధికారులు తీసుకురాబోతున్నారు.
ఇలా నేరుగా ప్రవేశాలు కల్పించే కోర్సుల్లో ఎరోనాటికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన పరీక్షలు రద్దు కానున్నాయి. పీజీఈసెట్ ద్వారా మొత్తం 19 సబ్జెక్టులకు ఎంట్రెన్స్ నిర్వహిస్తూవస్తున్నారు. అయితే పలు కోర్సుల్లో సీట్లు ఎక్కువగా మిగిలిపోతుండడం, అందులో ప్రవేశాలు ఆశించిన స్థాయిలో ఉండడంలేదు. పైగా ఎంట్రెన్స్‌కు తక్కువ మంది హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆయా సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేసి ఎంట్రెన్స్ లేకుండానే వాటిలో ప్రవేశాలను కల్పించాలని భావిస్తోంది.
ఈ ఏడాది 26 కళాశాలల్లో 720 వరకు ఎరోనాటికల్ ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉంటే పీజీఈసెట్ అర్హత సాధించినవారు నలుగురు మాత్రమే. ఆ నలుగురిలో ఒక్కరు కూడా కళాశాలలో చేరలేదు. అలాగే ఓ కళాశాలలో మెటలర్జీకి సంబంధించిన సీట్లు 30 ఉంటే అందులో కేవలం 5 మంది మాత్రమే సీట్లు పొందారు. ఇక టెక్స్‌టైల్ టెక్నాలజీలో 18 సీట్లకు గానూ ఒక్కరు కూడా అడ్మిషన్ పొందలేదు. కెమికల్ ఇంజనీరింగ్‌లో 137 సీట్లకు కేవలం 20 మంది అభ్యర్థులే ప్రవేశాలు పొందారు. ఇలా ఈ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవడం, సీట్లు భర్తీ కాకపోవడంతో వాటికి ప్రత్యేకంగా ఎంట్రెన్స్ నిర్వహించడమెందుకని అధికారులు భావిస్తున్నారు.
ఈనేపథ్యంలోనే సాధ్యాసాధ్యాలపై తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇటీవల ఒక కమిటీని సైతం నియమించింది. ఈ కమిటీలో ప్రధానంగా జేఎన్‌టీయూహెచ్ వైస్ ఛాన్స్‌లర్ కట్టా నర్సింహారెడ్డితోపాటు, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణ, పీజీఈసెట్ మాజీ కన్వీనర్ రవీంద్రారెడ్డి ఉన్నారు. నివేదిక రూపకల్పనలో ఈ కమిటీ తలమునకలైంది. ఈ కమిటీ రూపొందించిన తుది నివేదిక, సిఫారసుల ఆధారంగా ఈ నూతన విధానాన్ని అమలు చేయనున్నారు. కమిటీ సిఫారసులకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే వచ్చే 2024-25 విద్యాసంవత్సరం నుంచి పలు కోర్సులకు ఎంట్రెన్స్ లేకుండానే విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు.