ప్రభ న్యూస్ ప్రతినిధి మేడ్చల్ అక్టోబర్ 10: ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎలక్షన్ కోడ్) ఉల్లంఘించకుండా జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల నియమావళి తదితర అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందం ఎల్లప్పుడూ పర్యటిస్తుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అలాగే, సీ–విజిల్ యాప్‌ను వినియగించుకోవాలని, అన్ని రాజకీయ పార్టీల వారు తమ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, వజ్రేష్ యాదవ్, సి.పి.ఐ జిల్లా అధ్యక్షులు సాయిలు గౌడ్, సి. ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు అశోక్ , టిడిపి, బి.ఎస్.పి ల నాయకులు పాల్గొన్నారు.