Tuesday, November 26, 2024

కేంద్ర‌మంత్రి మ‌హేంద్ర‌నాథ్ పాండేను క‌లిసిన ఎంపీ, ఎమ్మెల్యే

భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎంటి మెషిన్ టూల్స్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే ను జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న హెచ్ఎంటి యూనియన్స్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లేఖ ద్వారా…పెండింగ్ బకాయిలు, జీతబత్యాలు, సదుపాయాలు వెంటనే చెల్లించాలన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు 4 సంవత్సరాల నుండి పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్, ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్, సెటిల్‌మెంట్ అలవెన్స్‌ల వరకు కార్మికులకు న్యాయబద్ధంగా రావాల్సింది నిలిపివేశారని, గత 7 నెలలుగా జీతం కూడా ఇవ్వడం లేదని, జీతాలు లేకపోవడంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొని అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.


పదవీ విరమణ వయస్సు 58 నుండి 60 సంవత్సరాలకు పెంచాలి :
ప్రస్తుతం హెచ్ఎంటి ఎంటిఎల్ లో పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలు ఉందని, అయితే గత 15 సంవత్సరాల నుండి రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ లేనందున అనుభవజ్ఞులైన ఉద్యోగులు ప్రతి నెలా విధులు నిర్వహిస్తున్నారని, ఇది ప్రతి విభాగంలోనూ అనుభవజ్ఞులైన కార్మికులతోనే సంస్థ నడుస్తుందని, హెచ్ఎంటి హోల్డింగ్, ఇంటర్నేషనల్ కోసం పదవీ విరమణ వయస్సు కూడా 60 సంవత్సరాలు ఉన్నందువల్ల అనుభవజ్ఞులైన కార్మికులను నిలుపుకోవటానికి, కంపెనీని సజావుగా నడిపించేందుకు 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పదవీ విరమణ వయస్సును వెంటనే పెంచాల్సిన అవసరముంద‌ని పేర్కొన్నారు.


ప్రాగ యూనిట్ కార్మికులకు న్యాయం చేయాలి :
హెచ్ఎంటి ప్రాగ యూనిట్ లో గత 35 సంవత్సరాలుగా పనిచేస్తున్న క్యాజువల్ కార్మికులకు సెటిల్ మెంట్ చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా ఉన్న హెచ్ఎంటీని వ్యూహాత్మక రంగాల్లో విలీనం చేయడం లేదా 2017పే స్కేల్, క్యాజువల్ ఎంప్లాయీస్ ఇష్యూ ఉన్న ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీమ్‌ను ప్రకటించేలా చొరవ చూపాలని వినతి పత్రంలో వారిని కోరారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగుల నైతికతను పెంపొందించడానికి, ఆర్థిక ఇబ్బందులు దూరం చేసి వారి అభివృద్ధికి దోహద పడేలా తమ దృష్టికి తీసుకువచ్చిన అన్ని అంశాలను పరిశీలించి వాటిపై ప్రత్యేక చొరవ చూపి ఆలస్యం చేయకుండా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ బిబి పాటిల్, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కార్మికుల తరపున వారిని కోరారు. ఈ మేరకు ఆయా అంశాలపై కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే సానుకూలంగా స్పందించి ఆయా సమస్యలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంటి నుండి యూనియన్ లీడర్స్ ఆర్.మహేందర్, జి.సత్యనారాయణ, పి.శ్రీశైలం, ఎం.ఆనంద్ రావు, బెంగళూరు ప్రెసిడెంట్ హరీష్, జనరల్ సెక్రెటరీ విజయ్ కుమార్, సదానంద్ గోపాల్, మనోహర్, ప్రాగ యూనిట్ పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement