న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే సమస్యలను పరిష్కరించాలని టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత రైల్వే మంత్రి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. తన నియోజకవర్గ పరిధిలోని అనేక రైల్వే అంశాలు, సమస్యలపై చర్చించేందుకు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సోమవారం ఆమె ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దక్షిణాది అయోధ్యగా కీర్తి గడించిన భద్రాచలం శ్రీరామచంద్రస్వామివారి పవిత్ర దివ్యక్షేత్రానికి దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారని, వారికి సౌకర్యవంతంగా ఉండడం కోసం పాండురంగాపురం నుంచి భద్రాచలానికి 12 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. అనేక ఏళ్లుగా ఈ అంశంపై వినతులు సమర్పిస్తున్నామని గుర్తు చేశారు.
ఇకనైనా శ్రీరామచంద్రుని దివ్యక్షేత్రం అభివృద్ధికి సహకరించాలని వినతి చేశారు. మణుగూరు నుంచి రామగుండం వయా భూపాలపల్లి నూతన రైల్వేట్రాక్ ఏర్పాటు చేయాలని కవిత, రైల్వే మంత్రిని కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడడం వల్ల ప్రయాణికుల రాకపోకలు విపరీతంగా పెరిగాయని, మరిన్ని రైల్వేహాల్టులు కల్పిచాలని ఆమె అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. మహబూబాబాద్ లో రప్తిసాగర్, జీటీ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం సూపర్ ఫాస్ట్, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్‌లు కల్పించాలని వివరించారు. డోర్నకల్ రైల్వేస్టేషన్లో మణుగూరు ఎక్స్‌ప్రెస్, పద్మావతి, ఛార్మినార్, గౌతమి, లింక్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్ కల్పించాలని కవిత వినతి చేశారు. ఆమె విజ్ఞప్తులను సానుకూలంగా విన్న అశ్వినీ వైష్ణవ్ పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.