Saturday, November 23, 2024

ప్రజోపయోగ పనులను సకాలంలో పూర్తి చేయించాలి …దిశా సమావేశంలో ఎం.పీ అర్వింద్

నిజామాబాద్, ఆగస్టు 29 : ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని, పనులు నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ(దిశా) సమావేశం జరిగింది.

కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై ఎజెండా అంశాల వారీగా సమావేశంలో చర్చించారు. ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, కంపా నిధులతో చేపట్టిన పనులు, ట్రిపుల్ ఆర్ పథకం కింద చెరువుల ఆయకట్టు స్థిరీకరణ, మరమ్మతులు, జాతీయ ఆరోగ్య మిషన్, ఫసల్ బీమా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్వనిది, రూర్బన్, ముద్ర రుణాల పంపిణీ, విద్యాభివృద్ధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఆయా పథకాల కింద కేంద్ర నిధులతో వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో తాత్సారం జరుగుతోందని అన్నారు. మాక్లూర్ మండలం అడవిమామిడిపల్లి వద్ద అప్రోచ్ రోడ్ నిర్మాణంతో పాటు ఆయాచోట్ల ఆర్ఓబి నిర్మాణ పనులు ఎందుకు మందకొడిగా కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులను వివరణ కోరారు. ఇప్పటికే గడువు ముగిసినా పనులు కొలిక్కి రాలేకపోతున్నాయని అన్నారు. నిర్దిష్ట గడువులోపు పనులను పూర్తి చేయడంలో విఫలమవుతున్న కాంట్రాక్టర్లపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అడవిమామిడిపల్లి ఆర్వోబి, అప్రోచ్ రోడ్ల నిర్మాణాలను అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. అలాగే, మామిడిపల్లి, బోధన్, ఆర్మూర్ ఆర్.ఓ.బీ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తయి ప్రజలకు వసతులు అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఆయా పనులు ఏ దశల్లో కొనసాగుతున్నాయి, వెచ్చించిన నిధుల వివరాలను తెలుపుతూ సమగ్ర నివేదికలు తనకు సమర్పించాలని ఆర్ అండ్ బి, ఇరిగేషన్, వ్యవసాయ, డీఆర్డీఏ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపర్చి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చొరవ చూపాలని సంబంధిత అధికారులకు హితవు పలికారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం మంజూరయ్యిందా అని ఎం.పీ ఆరా తీశారు.

దీనిపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ వివరణ ఇస్తూ, గతేడాది ప్రక్రుతి వైపరీత్యాలతో పంటలు కోల్పోయిన వారికి పరిహారం మంజూరయ్యిందని, ఈ ఏడాది పంటలు నష్టపోయిన వారి జాబితాను ప్రభుత్వానికి సమర్పించామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన చోట లబ్దిదారులను ఎంపిక చేసి త్వరితగతిన ఇళ్లను కేటాయించాలని ఎం.పీ సూచించగా, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గృహలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 42 వేల దరఖాస్తులు రాగా, క్షేత్ర స్థాయి పరిశీలన జరిపించి అందులో 30 వేల మంది వరకు అర్హులు ఉన్నారని గుర్తించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. గృహలక్ష్మి పథకానికి చివరి గడువు అంటూ ఏమీ లేదని, నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జతపర్చని వారి నుండి సైతం దరఖాస్తులు సవీకరించడం జరిగిందని సభ్యులకు వివరించారు.

- Advertisement -

కాగా, ప్రభుత్వ బడులలో విద్యార్థులకు మధ్యాన్న భోజనంలో గుడ్డు అందించడం లేదని సభ్యులు సమావేశంలో ఫిర్యాదు చేయగా, విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలపై ఆ వివరాలను పొందుపర్చడం లేదని పలువురు సభ్యులు సమావేశంలో ఆక్షేపణ తెలిపారు. దీనిపై ఎం.పీ స్పందిస్తూ, తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ నిధుల వివరాలను పొందుపర్చాలని అధికారులకు సూచించారు. 2016 నుండి ఇప్పటివరకు జిల్లాలో ముద్ర లోన్స్ కింద 1,58,694 మందికి 2264.88 కోట్ల రూపాయల రుణాలు అందించడం జరిగిందని లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ తెలుపగా, ముద్ర రుణాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఎం.పీ సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, డీ ఎఫ్ ఓ వికాస్ మీనా, డీ ఆర్ డీ ఓ చందర్, వివిధ శాఖల అధికారులు, దిశా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement