ప్రభన్యూస్ : కిట్టీ పార్టీల పేరుతో సంపన్న కుటుంబాలకు చెందిన వారిని మోసం చేసిన శిల్ప అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అధిక వడ్డీకి ఆశపడి తమ పిల్లల కోసం దాచుకున్న దబ్బునంతా శిల్పకే అప్పగిం చామని తాజాగా ఓ మహిళ తన గోడును పోలీస్ స్టేషన్‌లో వెళ్లబోసుకుంది. అయితే శిల్ప సేకరించిన డబ్బంతా ఓ ఖరీదైన బంగ్లా నిర్మించుకోవడానికే వాడుకుందని పోలీసులు తేల్చారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుతో శిల్పా చౌదరి ఆమె భర్తను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ విషయం బయటికి రావడంతో బాధితులు పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు ఇస్తున్నారు. మొదట 2 కోట్ల 50 లక్షలు ఫ్రాడ్ చేసిందని ప్రియ అనే మహిళ ఫిర్యాదు చేశారు. తన పిల్లల కోసం దాచుకున్న డబ్బును అధిక వడ్డీ ఇస్తానంటే శిల్పకు ఇచ్చామని ఆమె పేర్కొంది. అయితే రెండేళ్ల నుంచి వడ్డీ కట్టక పోగా తిరిగి అసలు మొత్తాన్ని ఇవ్వడం లేదని ఫిర్యాదులో తెలిపింది. ప్రియ ఫిర్యాదుతో శిల్ప వ్యవహారం బయటకు రావడంతో బాధితులు ఆయా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు ఇస్తున్నారు.
ఇప్పటి వరకు నార్సింగి, మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. దీంతో శిల్పా చౌదరి మొదట రెండు కోట్లు మోసం చేసిందని అనుకోగా.. ఆ తర్వాత ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో ముందుగా అనుకున్న దానికంటే భారీగానే వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల ప్రకారం ఆమె రూ.10 కోట్ల మోసానికి పాల్పడిందని గుర్తిం చారు. జంట నగరాల్లో రూ.70 కోట్లకుపైగా వసూలు చేసిందని అంటున్నారు. మొత్తం రూ.90 కోట్ల వరకు మోసానికి పాల్పడినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
సినీ సెలబ్రిటీలే కాకుండా ఇండస్ట్రియలిస్టులు, ఇతర ప్రముఖులు కూడా ఆమె దగ్గర అధికంగా పెట్టుబడి పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. హంగూ ఆర్భాటం ప్రదర్శించడంతో శిల్పాకు పెద్ద మొతంగా డబ్బు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని పోలీసులు భావిస్తున్నారు. అలాగే రియల్‌ఎస్టేట్‌లో లాభాలు ఇస్తామని ప్రచారం చేయడంతో కొందరు ప్రముఖులు ఆమెకు భారీగా డబ్బు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదట్లో కిట్టీ పార్టీల పేరుతో మహిళలకు స్నేహితురాలిగా మారిన శిల్ప ఆ తర్వాత వారికి భారీ వడ్డీ ఆశ చూపి డబ్బు వసూలు చేసిందని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు చెబుతున్నారు.
శిల్ప, ఆమె భర్త శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపడుతున్నారు. ఇక ఈ దంపతులను ఏడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు రేపు విచారించనుంది. కస్టడీలో ఉంటేనే అసలు విషయాలు బయటకు వస్తాయని అందువల్ల కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై వాదనల తర్వాత కస్టడీపై స్పష్టత రానుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital