తెలంగాణలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. 2021-23 మద్యం టెండర్ల కాలపరిమితి నవంబర్‌లో ముగియనున్నది. ఈ క్రమంలో మూడునెలల ముందుగానే ప్రభుత్వం 2023-25 కాలపరిమితికి ఈ నెల 4 నుంచి దరఖాస్తులను కోరింది. దీనికి పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. ఇవ్వాల్టి (శుక్రవారం)తో గడువు ముగుస్తుండగా చివరి రోజు పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తు చేసుకునేందుకు ఎక్సైజ్ కార్యాలయాల వద్ద క్యూ కట్టారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులు లక్ష దాటినట్టు తెలుస్తోంది.
అత్యధికంగా శంషాబాద్, సరూర్‌నగర్‌లో 8వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత నల్గొండ, ఖమ్మం జిల్లాలో 6వేలకు పైగా మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సులు జారీ చేసేందుకు ఈ నెల 3న ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న లైసెన్సులు నవంబర్ 30వ తేదీతో ముగియనున్నారు. కొత్తగా జారీ చేయనున్న లైసెన్సులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.