హైదరాబాద్, ఆంధ్రప్రభ : వన్యప్రాణుల వేటగాళ్ళు పెడుతున్న ఉచ్చులకు పులులు బలవుతున్న ఘటనలు వరుసగా జరగడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పులుల వేటగాళ్ళపై అటవీశాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేటగాళ్ళ కదలికపై నిఘాను మరింత పెంచారు. దీపావళి పండగ తర్వాత అన్ని జిల్లాల కన్జర్వేటర్లతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వన్యప్రాణుల రక్షణ, పోచింగ్ గ్యాంగ్‌ల ఆగడాలను కట్టుదిట్టం చేయడం, అటవీ సరిహద్దు గ్రామాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు తదితర అంశాలపై చర్చించ నున్నట్లు అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు ఆంధ్ర ప్రభకు చెప్పారు. అడవుల్లో ఆవాసం తగ్గిపోవడంతో చిరుత పులులు జన సంచార ప్రదేశాల్లోకి వస్తున్నా యని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వు 2,611 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. అలాగే కవ్వాల్ టైగర్ రిజర్వు 2016 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఒక పులి స్వేచ్ఛగా సంచరించేందుకు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం 25 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం అవసరం. టైగర్ రిజర్వులో పెద్ద పులుల కోసం శాఖాహార జంతువులు పెంచుతున్నారు. ఒక్కో పులికి 300 నుంచి 350 వరకు శాఖాహార జంతువులు అవసరం. అందుకోసం జింకలు, దుప్పిలు, నిల్గాయిలు, కొండగొర్రెలు, మనుబోతు లను అటవీశాఖ పెంచుతుంది. శాఖాహార జంతువుల కోసం గడ్డి క్షేత్రాలను పెంచుతున్నారు.ఉమ్మడి అదిలాబాద్ తదితర జిల్లాల్లోని అటవీ గ్రామాలను ఆనుకుని ఉన్న పంట పొలాలను అడవి పందులు నాశనం చేయకుండా ఉచ్చులు వేయడం, కంచెకు కరెంట్ తీగలను రైతులు అమర్చుతున్నారు. ఆ ఉచ్చుల్లో అడవి పందుల బదులు పులులు బలైపోతు న్నట్లు అటవీశాఖ అధికారుల విచారణలో తేల్చారు. మరోపక్క ఉచ్చులకు బలైన పులుల విషయాన్ని వేటగాళ్ళు కొద్ది నెలల పాటు దాచిపెట్టి, అనంతరం పులి చర్మాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు ఇటీవల అదిలాబాద్ జిల్లాల్లో వెలుగు చూశాయి.
ములుగు, ఇంద్రవల్లి ప్రాంతాల్లో అటవీశాఖ సిబ్బంది బృందంలో ఒకరు పులి చర్మం కొనుగోలుదారుడిగా మారి, అసలు వేటగాళ్లను పట్టుకుని చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. కరోనా సమయంలో వన్యప్రాణాలకు ఏలాంటి ముప్పు జరగకుండా అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే వేటగాళ్ళ ఉచ్చులకు చిక్కుతున్న పులులు హతమవుతుండటం వాటి ఉనికికే ప్రశ్నార్ధకంగా మారేలా ఉంది. ఓపక్క పులుల సంరక్షణకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోగా, మరోపక్క పక్క వచ్చే ఏడాది జనవరి నుంచి పులుల గణనను ప్రారంభిం చనుంది. ఈ క్రమంలో వేట గాళ్ళ ఉచ్చునుంచి పులులను రక్షించలేక పోవడం ఆందోళన కలిగిస్తుంది.
వన్యప్రాణులను కాపాడేందుకు అటవీశాఖ సిబ్బందిని పెంచింది. సిబ్బంది కోసం 2173 వాహనా లను అందజేసింది. 90 మంది ఎఫ్‌ఆర్వోలు, 67 మందిఎఫ్‌ఆర్వోలు, 1857 ఎఫ్‌బీవోలను కొత్తగా నియమించారు. పులుల సంరక్షణతోనే అడవుల రక్షణ సాధ్యమని, వాటి మనుగడకు అందరూ కృషి చేయాలని అటవీశాఖ పిలుపునిచ్చినప్పటికీ ఆ దిశగా చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దపులి చర్మం, గోళ్ళు, వెంట్రుకలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో వేటగాళ్ళు రెచ్చిపోతున్నారు. కొన్నేండ్లుగా రాష్ట్రం లోని అడవుల్లో నాలుగు పెద్ద పులులు చనిపోయాయి. వాటిలో ఒకటి అనారోగ్యంతో మరణించగా, మిగిలిన మూడు వేటగాళ్ళ వేటకు బలయ్యాయి. వాస్తవానికి 2013 తర్వాత పొరుగు రాష్ట్రాల నుంచి పులుల వలసలు పెరిగాయి. అదిలాబాద్ సరిహద్దులోని మహారాష్ట్ర చంద్రాపూర్, గడ్డిరోలి, తిప్పేశ్వర్, తడోబా అలాగే చత్తీష్‌గఢ్‌ల నుంచి కాగజ్‌నగర్, చెన్నూర్, కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులోకి పులుల రాక పెరిగింది. తడాబా నుంచే పులుల వలసలు అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.