Tuesday, November 26, 2024

హస్తకళలకు మరింత ప్రోత్సాహం.. మార్కెటింగ్‌కు ప్రత్యేక షోరూమ్‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో హస్త కళలు, కళాకారుల అభివృద్ధికి తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ(టీఎస్‌హెచ్‌డీసీ) ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని ఆ సంస్థ చైర్మన్‌ బొల్లం సంపత్‌కుమార్‌ గుప్తా తెలిపారు. చెక్క బొమ్మలు, బంజారీ ఎంబ్రాయిడరీ, సిల్వర్‌ ఫిలిగ్రి కళాకారుల సౌకర్యార్థం గత ఏడాది డీ.సీ.హెచ్‌ సహకారంతో ఆధ్వర్యంలో బొంతపల్లి, దేవరకొండ, నిర్మల్‌, కరీంనగర్‌లలో 4 కామన్‌ ఫెసిలిటీ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. తెలంగాణ హస్త కళలకు మార్కెటింగ్‌ అనే అంశంపై హైదరాబాద్‌లోని నిమ్స్‌ మే సంస్థలో జరిగిన ఒక రోజు సెమినార్‌లో సంపత్‌ కుమార్‌ గుప్తా మాట్లాడారు. రాష్ట్రంలోని హస్త కళాకారుల నైపుణ్యాన్ని పెంచడం కోసం డీ.సీ.హెచ్‌ వారి సౌజన్యంతో టీఎస్‌హెచ్‌డీసీ వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిందన్నారు.

రాష్ట్రంలోని కళాకారులు తయారు చేసినటువంటి కళాఖండాలను విక్రయించడం కోసం తెలంగాణతో సహా కోల్‌కతా, న్యూ ఢిల్లి పట్టణాల్లో మొత్తం 9 గోల్కొండ షోరూమ్‌లు ఉన్నాయని, త్వరలో ఒక కొత్త షోరూమ్‌ను కరీంనగర్‌లో నిర్మిస్తున్నామన్నారు. త్వరలో దానిని ప్రారంభిస్తామన్నారు. అంతేకాకుండా వరంగల్‌లో ఒక షోరూమ్‌ కోసం 500 గజాల స్థలాన్ని ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ‘ప్రతి ఏటా 10 మంది నైపుణ్యం కలిగినటువంటి కళాకారులకు స్టేట్‌ అవార్డులు అందజేస్తున్నాం. మొదటి ముగ్గురు కళాకారులకు రూ.25,000ల చొప్పున మొదటి ఏడుగురు కళాకారులకు రూ.10వేల చొప్పున అందిస్తున్నాం. ప్రస్తుతం 100 మంది కళాకారులకు వృద్ధాప్య ఫించనులను సంస్థ తరపున అందజేస్తున్నాం’ అని సంపత్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ టెక్స్‌టైల్‌ కార్యదర్శి శైలజా రామయ్యార్‌, నిమ్స్‌ మే డి.జి గ్లోరీ స్వరూప, కేంద్ర టెక్స్‌టైల్‌ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎమ్‌. ప్రభాకరన్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement