ప్రభన్యూస్, ప్రతినిధి ,భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుదవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. మొరంచ వాగు ఉగ్ర రూపానికి మొరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారి పై మొరంచపల్లి వద్ద సుమారు 15 ఫీట్స్ ఎత్తులో మొరంచ వుప్పొంగి ప్రవహిస్తోంది. దీనితో 353సీ జాతీయ రహదారి పై రవాణా పూర్తిగా నిలిచి పోయింది. ఎగువన గణప సముద్రం 3 ఫీట్లు మేర మత్తడి పడుతుండం, ఆ నీరు మొరంచలో చేరటంతో ప్రవాహం ఉధృతి మరింత పెరిగింది.
దీంతో భారీగా వచ్చే నీటితో మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అయితే బుధవారం రాత్రి నుండి ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో గ్రామస్థులు బస్టాండ్ ఆవరణలో ఉన్న ఓ బిల్డింగ్ పైకి ఎక్కి వర్షంలో భయం గుప్పిట్లో గడుపుతున్నారు.చుట్టూ ఎటు వెళ్లలేని పరిస్థితిలో అష్టజల దిగ్బంధంలో చిక్కుకున్నారు.
సహాయం కోసం ఎదురు చూపులు
మోరంచపల్లి గ్రామస్తులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మొరంచపల్లికి అధికారులు వెళ్లాలంటే ఇటు ఘనపురం లక్ష్మారెడ్డి పల్లి వరకే చేరుకునే అవకాశం ఉంది. అవతలి వైపు భూపాలపల్లి నుండి అధికారులు రావడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. భూపాలపల్లి మైసమ్మ గుడి వద్ద వాగు ఉదృతి పెరగటం, మొరంచపల్లి వద్ద మొరంచ ఉదృతంగా ప్రవహించడంతో అధికారులు చేరుకోలేని పరిస్థతి ఏర్పడింది. కేవలం హెలికాప్టర్ ద్వారానే ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. గంట గంటకు మోరంచ ప్రవాహం ఉద్ధృతి పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. జిల్లా ఉన్నతధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.