గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ గొడవల నేపథ్యంలో మోహన్ బాబు అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి చేరారు. విపరీతమైన ఒళ్లు నొప్పులు, స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన ఎడమ కంటి కింద గాయమయింది. బీపీ పెరిగింది. గుండె కొట్టుకోవడంలో కూడా హెచ్చుతగ్గులు కనిపించాయి.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నేరుగా జల్ పల్లి లోని ఇంటికి చేరుకున్నారు. మరోవైపు మీడియా ప్రతినిధిపై దాడి చేసిన ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు.
కాగా, సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ విషయంలో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేయడం జరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబు నివాసంలో జరిగింది వాళ్ల వ్యక్తిగతమని… అయితే వాళ్ల వల్ల పబ్లిక్ డిస్టర్బ్ కాకూడదని చెప్పారు. జల్ పల్లిలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నందువల్లే ముగ్గురికీ నోటీసులు ఇచ్చామని తెలిపారు.