Tuesday, November 26, 2024

ఆలీబాబా అరడజను దొంగలకు మోడీ రక్షణ…కూనంనేని

మహబూబ్ నగర్ : భారతదేశంలో ప్రజల సంపదను దోచుకుంటున్న ఆలీబాబా అరడజను దొంగలను ప్రధాని నరేంద్ర మోడీ రక్షిస్తున్నారని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. మంగళవారం మహబూబ్ నగర్ పట్టణంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వ‌హించిన‌ విలేకరుల స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, బ్యాంకులు, బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలను దోచుకుంటున్న కార్పొరేట్ వ్యాపారులకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ పాలన సాగిస్తున్న బిజెపి ప్రభుత్వం పుట్టకముందే ఈ దేశంలో హిందూమతం ఉందని గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉన్న ఈ దేశంలో మతం పేరుతో కలుషితం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో కులాల పేరుతో, మతాల పేరుతో విభజించి పాలిస్తున్నారని ద్వజమెత్తారు. ఈ దేశంలో కార్పొరేట్ వ్యాపారులు అత్యధికంగా నిధులు ఇస్తున్నది ఒక బీజేపీ పార్టీకేనని, వారి కోసమే మోడీ ధన పాలన సాగిస్తున్నారన్నారు. దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చిందని, మిగతా రాష్ట్రాలలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల‌ను కూల్చడం ద్వారా, వేధించడం ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా చేసి, ప్రజల నుండి దోపిడీ చేసి దోచుకుంటున్న వారిని దేశభక్తుల్లా చిత్రీకరించడం అన్యాయమన్నారు. ఎనిమిదేళ్ల క్రితం 6వేల కోట్లు ఉన్న ఆదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ నేడు ప్రపంచంలో రెండో స్థానానికి ఎలా ఎదుగుతదని ప్రశ్నించారు. ప్రభుత్వ సంపాదన దోచుకొని స్వేచ్ఛగా విదేశాలకు పారిపోతున్న వారిని ఏమి చేయలేని మోడీ ప్రభుత్వం భారత దేశంలో ప్రశ్నిస్తున్న వారిని చట్టసభల నుంచి బహిష్కరించడం అన్యాయమ‌న్నారు. దేశంలో జరుగుతున్న మొత్తం వ్యవహారంపై జేపీసీ వేసి సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులకు చట్టసభల్లోకి వెళ్లడానికి బలం లేకపోయినా ప్రజలకు అన్యాయం చేసే పార్టీలను ఓడించే సత్తా ఉందని ఇప్పటికే రుజువైందని తెలిపారు. తెలంగాణలో పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లౌకికవాదాన్ని వ్యతిరేకించే పార్టీలతో స్నేహం చేస్తామని, వచ్చే ఎన్నికల్లో అలాంటి వారికి త‌మ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ, మాజీ జిల్లా కార్యదర్శి పరమేశ్వర్ గౌడ్, ప్రస్తుత కార్యదర్శి బాలకిషన్, గద్వాల జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, వనపర్తి జిల్లా కార్యదర్శి విజయ రాములు, సురేష్, రాము, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement