వరంగల్: కేసీఆర్ ప్రభుత్వం అంటే అత్యంత అవినీతి ప్రభుత్వం అని.. ఇప్పుడు వారి అవినీతి ఢిల్లీకి కూడా పాకిందని ప్రధాని మోడీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ పని , వారికి పొద్దున లేస్తే అదే పని అని మండిపడ్డారు. కుటుంబాన్ని పెంచిపోషించడమే కేసీఆర్ సర్కార్ పని పని అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం స్కామ్‌ల్లో ఇరుక్కుందని , కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటిని వెలికితీసే పనిలో పడ్డాయని అన్నారు.. వరంగల్ లో నిర్వహించిన బిజెపి విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగిస్తూ, తొలుత తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. భద్రకాళి అమ్మవారి మహాత్యానికి, సమ్మక్క-సారలమ్మ శౌర్యానికి, రాణి రుద్రమ పరాక్రమానికి నిదర్శనమైన వరంగల్‌కు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఒక బీజేపీ కార్యకర్తగా తాను వరంగల్‌కు వచ్చానని చెప్పారు. జనసంఘ్ కాలం నుంచి ఈ ప్రాంతం తమ భావజాలానికి బలమైన కోటగా ఉందని అన్నారు. ఇక తన ప్రసంగంలో కెసిఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు..కుటుంబ పాలన, అవినీతి ప్రభుత్వం అంటూ పదే పదే వక్కాణించారు. దేశంలోని కుటుంబ పార్టీలన్నింటికీ అవినీతి పునాది ఉందని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించిందని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వం చేసింది 4 పనులు మాత్రమేనని.. ఉదయం, సాయంత్రం మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుర్భాషలాడటం.. ఒక కుటుంబాన్ని అధికార కేంద్రీకృతం చేసి తెలంగాణకు వారే యజమాని అని నిరూపించుకోవడం.. తెలంగాణ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోవడం.. తెలంగాణను అవినీతిలో ముంచడం అంటూ మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 9 సంవత్సరాలలో మొత్తం ప్రపంచంలో భారతదేశం గర్వం పెరిగిందని అన్నారు. అందరూ భారతదేశం వైపు చూస్తున్నారని.. దీని వల్ల తెలంగాణ కూడా లాభపడిందని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని.. తెలంగాణ యువత దీని వల్ల లబ్ది పొందుతున్నారని, వారికి ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు. ఎక్కడైనా అభివృద్ది కోసం రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని.. అవినీతి కోసం ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. ఇందుకోసమేనా తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చేసిందని? ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాలని అన్నారు. కేసీఆర్ అవినీతి నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని అన్నారు. టీఎస్‌పీఎస్సీ స్కామ్‌తో యువత ఎంతో నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా తెలంగాణ ప్రజలకు రెండూ ప్రాణాంతకమే అని అన్నారు. ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడాలని కోరారు. తెలంగాణ వర్సిటీల్లో మూడువేల అధ్యాపక పోస్టులు భర్తీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో 15 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. నిరుద్యోగ యువతకు రూ. 3 వేల భృతి ఇవ్వలేదని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంపై సర్పంచ్‌లు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. 9 ఏళ్లలో కేంద్రం గ్రామపంచాయితీలకు లక్ష కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని చెప్పారు. ఆ నిధులను తెలంగాణ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు. తాము రైతుల పంటకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చి.. చేసి చూపించామని అన్నారు.
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్క్ ఇచ్చామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఎస్సీలు, ఎస్టీలు, పేదలను మోసం చేసిందని విమర్శించారు. ఆదివాసీ గ్రామాలకు ఎలాంటి మౌలిక సౌకర్యం కల్పించడం లేదని మండిపడ్డారు. తాము ఆదివాసీ ప్రాంతాల్లో ఆరులైన్ల రహదారులు వేస్తున్నామని చెప్పారు. ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే హైదరాబాద్‌లో కొందరికి నిద్రపట్టదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. గతాన్ని ప్రస్తావిస్తూ, బీజేపీ తొలుత సాధించిన రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి హన్మకొండ అని అన్నారు. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని అన్నారు. అందులో తెలంగాణ అతి ముఖ్యమైన భూమిక అని చెప్పారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ ట్రైలర్ చూపించిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. “అబ్ కీ బార్ బిజెపి సర్కార్” అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.