Friday, November 22, 2024

ఏక‌కాలంలో 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధి ప‌నుల‌కు మోడీ శ్రీకారం

ఢిల్లీ: దేశ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని ప్రధానమంత్రి మోడీ అన్నారు. అమృత్‌ భారత్‌ పథకం కింద దేశంలోని 508 రైల్వేస్టేషన్ల పునరభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ లలో 55, బీహార్ లో 49, మహారాష్ట్రలో 44, బెంగాల్ లో 37, మధ్యప్రదేశ్ లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్ లో 22, గుజరాత్, తెలంగాణలలో 21, జార్ఖండ్ లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో అభివృద్ది పనుల్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాచలం రోడ్డు, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట, ఖమ్మం, మధి, మహబూబ్ నగర్ మహబూబాబాద్ , మలక్ పేట, మల్కాజిగిరి, నిజామాబాద్, రామగుండం, తాండూరు, రాయగిరి, జహీరాబాద్ రైల్వేస్టేషన్లను అభివృద్ది చేయనుంది ప్రభుత్వం. క‌రీంన‌గ‌ర్ స్టేష‌న్ శంకుస్థాపన కార్య‌క్రమంలో ఎంపి బండి సంజ‌య్ పాల్గొన్నారు.

‘‘రైల్వే స్టేషన్ల వద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌, గేమింగ్‌ జోన్‌లు ఏర్పాటు చేయనున్నాం. అభివృద్ధి చేశాక ఈ స్టేషన్లు మల్టీ మోడల్ హబ్‌గా మారతాయి. అభివృద్ధి దిశగా దేశం పరుగులు పెడుతోంది’’ అని మోడీ తెలిపారు. తెలంగాణలోని 21 రైల్వేస్టేషన్లకు రూ. 894.09 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని 18 రైల్వే స్టేషన్లకు రూ.453.50 కోట్ల వ్యయంతో రైల్వేశాఖ అభివృద్ధి చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement