కాంగ్రెస్ కు పెరిగిన ఆదరణను చూసి మోదీ భయపడుతున్నారని.. ఆయన ముఖంలో భయం కనిపిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇవాళ కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎన్నికల సందర్భంగా బీజేపీ ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన ఎల్‌కే అద్వానీకి నమస్కారం చేయలేని మోదీకి.. పీవీ నర్సింహారావు గురించి మాట్లాడే అర్హత లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అర్బన్ టెర్రరిజంపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర విభజన చట్టం హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. ఎన్నికల వేళ ప్రజల మధ్య విద్వేషాలు పెంచేలా మోడీ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ ఏం మాట్లాడిన ఆయన ముఖంలో భయం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. మోడీ మాటలు ప్రధాన మంత్రి పదవి స్థాయిని దిగజారుస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. హిందువుల సంపద ముస్లింలకు పంచుతారని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
ఏ ప్రధాని మాట్లాడనంత నీచంగా, రక్తపాతం సృష్టించే విధంగా మోదీ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శివాజీ విగ్రహాలు ఎన్నికలప్పుడే బీజేపీకి గుర్తొస్తాయన్నారు. 400 సీట్లు అడిగి రాజ్యాంగం మార్చాలని చూస్తోన్న బీజేపీపై కేసీఆర్ వైఖరి చెప్పాలన్నారు. కాంగ్రెస్ మాత్రమే దేశంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. కాంగ్రెస్ విజయం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి అవసరమని అన్నారాయన.
సిరిసిల్ల సంక్షోభంలో పడినా టెక్స్ టైల్ జోన్ ను వరంగల్ కు తరలించినా.. అప్పటి ఎంపీ వినోద్ పట్టించుకోవడం లేదని మంత్రి విమర్శించారు. బండి సంజయ్ వివాదాలతో గుర్తింపు పొందారని.. ఆయన ఎంపీగా కరీంనగర్ కు ఏం చేయలేదని చెప్పారు. త ల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ మాట్లాడితే.. పార్లమెంట్ లోనే ఉన్న బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తాము తెలంగాణ కోసం ఆనాడు మాపార్టీతోనే కొట్లాడామని గుర్తు చేశారు. కరీంనగర్ లో తామంతా ఐక్యంగా పనిచేసామని… మా గెలుపు తథ్యమని మంత్రి పొన్నం అన్నారు.