కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణలో ఇంతకాలం ఉన్న బీఆర్ఎస్ రెండూ ఒకే విధంగా పనిచేశాయని.. అక్కడ ప్రధాని మోదీ, ఇక్కడ ఇంతకుముందు సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రజలకు మేలు చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వరంగల్ జిల్లా మడికొండలో జరుగుతున్న బహిరంగ సభలో మోదీ, కేసీఆర్‌పై విమర్శలతో దాడి చేశారు. రైతు చట్టాలపై మోదీ మెడలు వంచిన ఘనత రైతులదేనని.. బహిరంగ క్షమాపణ చెప్పిన తీరు మోదీది అని రేవంత్ అన్నారు..
తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ ఆగమాగం చేశారన్నారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకుని తిరిగారని, ప్రాజెక్టుల్లో అక్రమాలతో కూలిపోయే దశకు వచ్చాయన్నారు. అటు కేంద్రం, ఇటు తెలంగాణలోని కేసీఆర్ తీరును తూర్పారబట్టారు.
మోదీ అన్నింటిపై జీఎస్టీలు వేసి ప్రజలను రాచి రంపాన పెట్టారన్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఇక.. దేవుళ్ల పేరుతో మరోసారి రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడ ఉన్న నేత గురించి మీ అందరికి తెలుసు అని.. అప్పుడు భూములు ఆక్రమించుకున్న వ్యక్తి రంగు బట్టలు మార్చి మళ్లీ మీ ముందుకు వస్తున్నారని నమ్మొద్దని అన్నారు..
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంతో మేలు చేసిందని, నాగార్జన సాగర్, శ్రీశైలం వంటి ఎన్నో అద్భుత ప్రాజెక్టులు కట్టారన్నారు. అలాంటి మంచి పార్టీని గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు.