Tuesday, November 26, 2024

ఆధునిక ప‌రిక‌రాల్లేవ్‌, శస్త్రచికిత్సలెలా.. హాస్పిట‌ళ్ల‌లో వేధిస్తున్న సమస్య

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సల సంఖ్య పెరగాలంటే అందుకు తగినట్లుగా సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సర్కారీ వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. తగినంత మంది సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు, టెక్నికల్‌ సిబ్బంది, ఆపరేషన్‌ థియేటర్లు లేకుండా శస్త్ర చికిత్సల సంఖ్య ఎలా పెంచాలంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు పెరగాలన్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశాలను ప్రభుత్వ వైద్యులు స్వాగతిస్తున్నారు. ఒక ఆపరేషన్‌ థియేటర్‌ ఇచ్చి నెలకు 50 ఆపరేషన్లు చేయమంటే ఎలా..? అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ఆస్పత్రుల్లో ఆర్థోపెడిక్‌, కిడ్నీ, కార్డియాలజీ తదితర విభాగాల సూపర్‌ స్పెషలిస్టు వైద్యుల కొరత ఉంది. దాంతోపాటు ఎక్స్‌ రే, ట్రాక్స్‌ టేబుల్‌ బెడ్‌ వంటి కనీస సదుపాయాలు లేవు. ఈ పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో ఆర్థోపెడిక్‌ ఆపరేషన్లు చేయమంటే ఎలా అని ప్రభుత్వ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్‌ థియేటర్‌, ఇంప్లాంట్‌ పరికరాలు, సూపర్‌ స్పెషలిస్టు వైద్యులు, టెక్నికల్‌ సిబ్బందిని సమకూరిస్తే పలు రకాల శస్త్ర చికిత్సలను ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే పెద్ద సంఖ్యలో నిర్వహిస్తామని చెబున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మంచిదేనని, అయితే తగినన్ని వైద్య ఉపకరణాలు సమకూర్చకపోతే ఆపరేషన్లు ఎలా నిర్వహించాలి..? అని వాపోతున్నారు. శస్త్ర చికిత్సలు చేయాల్సిన విభాగాల్లో వైద్యులు ఉంటే… మిషనరీ లేదని, కొన్ని విభాగాల్లో మిషనరీ ఉంటే వైద్యులు లేరని గుర్తు చేస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో ఎక్స్‌ రే, ఎంఆర్‌ఐ, స్కానింగ్‌ తదితర యంత్రాలు మరమ్మతులకు గురికావటంతో పేషెంట్ల ముందు వైద్యులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. దాంతో విధిలేని పరిస్థితుల్లో ప్రయివేటుకు వెళ్లి టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం వైద్య, ఉపకరణాలను సమకూర్చినా వాటి నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటంతో పేద, సామాన్య పేషెంట్లకు డయాగ్నస్టిక్‌ సేవలు ఆశించిన రీతిలో అందటం లేదు.

అదే మిషన్‌ను కొనితెచ్చుకుంటున్న ప్రయివేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లు కోట్లు సంపాదిస్తున్నాయి. సీటీ స్కాన్‌, ఏబీసీ మిషన్‌, ఎక్స్‌ రే తదితర మిషన్ల నిర్వహణపై ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పకడ్బందీగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య ఉపకరణాలను సమర్థంగా నిర్వహించేందుకు యాన్యువల్‌ మెయింటనెన్స్‌ కాంట్రాక్టు (ఎంఎంసీ)ని తీసుకొచ్చింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతంపై దృష్టి పెట్టింది. పలు ఆస్పత్రులకు వైద్య ఉపకరణాలను సమకూర్చింది. అయితే అక్కడ సూపర్‌ స్పెషలిస్టు వైద్యుల కొరత వేధిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల సంఖ్య పెంచటంతోపాటు ఆర్థోపెడిక్‌, కార్డియాలజీ ఉపకరణాలను సమకూర్చాలని వైద్యులు కోరుతున్నారు. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న ఆపరేషన్ల సంఖ్య పెరిగిందంటున్నారు. స్పెషలిస్టు వైద్యులను అపాయింట్‌ చేస్తే ఆపరేషన్ల సంఖ్య మరింత పెంచుతామంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement