హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు తెలంగాణలో ప్రముఖులు ఒక్కొక్కరికి షాకిస్తున్నారు. వారి సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేస్తున్నారు. మొన్న మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ హ్యాక్ కాగా, ఇవ్వాల గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. అంతే కాకుండా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని కవిత తెలిపారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ తో పాటు ఇన్‌స్టాగ్రామ్ ఖతాలు కూడా హ్యాక్ కు గురయ్యాయి. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి సైబర్ నేరగాళ్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు. వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు.