Thursday, November 21, 2024

TS : క‌విత రిమాండ్… 23 వ‌ర‌కు పొడిగింపు…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రిమాండ్ పొడిగిస్తూ తీర్పును వెలువరించింది. కవిత రిమాండ్‌ను పొడిగించాలంటూ ఈడీ చేసిన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది.

- Advertisement -

ఏప్రిల్ 23 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు కోర్టు తీర్పును వెలువరించింది. కవిత తాజా తీర్పుతో కవిత ఈ నెల 23 వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. కవిత పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఇప్ప‌టికే కోర్టు తిరస్కరించింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు.

అయితే, లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం కవితకు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగియడంతో అధికారులు ఆమెను కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కవితకు జ్యుడిషియల్ రిమాండ్ కొనసాగించాలని ఈడీ కోర్టును కోరింది. ఆమె బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని, అందువల్ల జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలని కోరారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమి లేవని, 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతోందని, ఆమె దర్యాప్తును ప్రభావితం చేసే వ్యక్తి అని మొదటి నుంచి అంటున్నారు.. కానీ అలాంటిది ఏమి లేదన్న కవిత తరుఫు న్యాయవాది రానా అన్నారు.

మరోవైపు కవితతో రెండు నిమిషాలు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరుఫు లాయర్ జడ్జిని కోరారు. కవిత లాయర్ విజ్ఞప్తిని జడ్జి తిరస్కరించారు. నిందితురాలు నేరుగా మాట్లాడే హక్కు ఉంటుందన్న కవిత తరపు న్యాయవాది వాదించగా.. అప్లికేషన్ ఇవ్వాలని జడ్జి కావేరి బవేజా సూచించారు. దీంతో కోర్టులో హాలులో భర్త, మామను కలిసేందుకు కవిత తరుఫు న్యాయవాదులు అప్లికేషన్ ఇచ్చారు. జడ్జి అనుమతితో కోర్టు హాలులో కవితను ఆమె భర్త అనిల్, మామ రామకిషన్‌రావు కలిశారు.

మ‌రో వైపు కవిత తీహార్ జైలు నుండి లేఖ విడుదల చేశారు. కోర్టులో ఆమె చెప్పదల్చుకున్న అంశాలను నాలుగు పేజీలతో కూడిన లేఖలో పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఈ లేఖలో స్పష్టం చేశారు. తనకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో తాను బాధితురాలినని.. లిక్కర్ కేసులో తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేశాననడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని.. రెండున్నరేళ్ల కేసు విచారణలో ఎలాంటి సాక్ష్యాలు లభించలేదన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితుల స్టేట్మెంట్‌తో తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో మీడియా ట్రైలర్ ఎక్కువ జరుగుతుందని.. సీబీఐ, ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతుందన్నారు.

నా మొబైల్ నెంబర్‌ను అన్ని ఛానల్‌లో వేసి నా ప్రైవసీకి భంగం కలిగించారని పేర్కొన్నారు. నా రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వివరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నాలుగుసార్లు విచారణకు హాజరయ్యా.. తన బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి విచారణకు సహకరించానని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలకు నా ఫోన్లను కూడా అందజేశానని.. కానీ వాటిని ధ్వంసం చేసినట్లు తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.

ఈడీ, సీబీఐ నమోదు చేస్తోన్న 95 శాతం కేసులన్నీ విపక్ష నేతలకు సంబంధించినవేనని.. బీజేపీలో చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా విపక్ష నేతలను ఉద్దేశించి ‘నోరు మూసుకోకపోతే ఈడీని పంపుతాం’ అని బీజేపీ నేతలు అన్నారన గుర్తు చేశారు. లిక్కర్ స్కామ్ కేసు విచారణకు పూర్తిగా సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. తనకు బెయిల్ మంజారు చేయాలని అభ్యర్థిస్తున్నానని కవిత లేఖలో విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement