Tuesday, November 26, 2024

MLC Election – ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ప‌ట్టెవ‌రిదో మ‌రి! హీట్ పెంచుతున్న ఉప ఎన్నిక‌

తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక హీట్ పెంచుతోంది. వరంగల్‌- ఖమ్మం- నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 30న జ‌ర‌గ‌నుంది. కాగా, పోటీలో ఉన్న‌ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఈ మ‌ధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 52 మంది ఈ స్థానానికి పోటీ పడుతుండగా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్ఎస్‌ నుంచి ఏనుగుల రాకేశ్‌ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి బరిలో ఉన్నారు.

కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి సీపీఎం మద్దతు తెలిపింది. ఈ మేరకు పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న గెలుపునకు కృషి చేస్తామని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్ప‌ష్టం చేశారు. లోక్‌స‌భ ఎన్నికల్లో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం ఇండియా కూట‌మిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చామని పేర్కొన్నారు. అలాగే.. ఇప్పుడు కూడా బీజేపీని ఓడించడం కోసం కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని తమ్మినేని వెల్ల‌డించారు.

- Advertisement -

ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవడంపై బీఆర్ఎస్ ఫోకస్

వరంగల్‌- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత‌ రాష్ట్ర సమితి యత్నిస్తోంది. తెలంగాణలో శాసనమండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి అక్కడ గులాబీ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. దీంతో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జిల్లాల్లో సమావేశాలు నిర్వహించడంతో పాటు మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలోనూ కేటీఆర్ స్పీడు పెంచారు.

దృష్టిపెట్టిన బీజేపీ..

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. శాసనమండలిలో తమ బలం పెంచుకునేందుకు ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఉద్యోగ, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి చేసిన మోసాలను వివరిస్తూ మండలిలో పట్టభద్రుల గళం వినిపించేందుకు త‌మ అభ్య‌ర్థిని గెలిపించాలని కమలదళం అభ్యర్థిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి విజయం కోసం పార్టీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement